సామర్లకోట (రెడ్ బీ న్యూస్) 5 జనవరి 2022 : ‘‘అధికార పార్టీ కౌన్సిలర్, నాయకుల ప్రమేయంతో.. వార్డు వాలంటీరు, ఆమె భర్త తప్పుడు ఫిర్యాదు చేశారు.. పోలీసులు కేసు నమోదు చేసి చిత్రహింసలకు గురి చేయడం వల్లే మా బిడ్డ ఉరేసుకున్నాడు.. మాకు న్యాయం చేయాలి. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని’’ సామర్లకోట పట్టణ పరిధిలోని బలుసులపేటకు చెందిన ఆలపు గిరీష్‌బాబు కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు. బుధవారం ఉదయం గిరీష్ బలవన్మరణం నేపథ్యంలో బంధువులు, వివిధ సంఘాల ప్రతినిధులు సామర్లకోట పోలీస్‌స్టేషన్ వద్ద చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. ఉదయం 11 నుంచి రాత్రి 11.00 గంటల వరకు ఆందోళన కొనసాగించారు. గిరీష్ మృతదేహాన్ని బలవంతంగా కాకినాడ తరలించే క్రమంలో తోపులాట జరిగింది.
పలువురిపై ఫిర్యాదు:
గిరీష్ మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అతని అన్న ఆలపు ప్రవీణ్‌కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైకాపా నాయకుడి ప్రోద్బలంతో వాలంటీరు దువ్వా మల్లిక, ఆమె భర్త వెంకటేష్ తప్పుడు ఫిర్యాదు చేశారన్నారు. ఎస్సై, సీఐ సరిగా దర్యాప్తు చేయకుండా నాయకులు గంగిరెడ్డి కృష్ణమూర్తి, నేతల హరిబాబు, పాలిక చంటిబాబు, నానిబాబుతో కలిసి వేధించారన్నారు. తన తండ్రిని పోలీసుస్టేషన్‌కు రప్పించి.. నీ కొడుకు గిరీష్ వస్తాడా? లేక నిన్ను గుడ్డలు ఊడదీసి కొట్టుకుంటూ తీసుకురమ్మంటావా? అని బెదిరించారన్నారు. 2న గిరీష్ స్టేషన్‌కు వెళ్తే ఎస్సై దారుణంగా కొట్టారని ఆరోపించారు. గట్టిగా కొట్టమని నాయకులు ఫోన్లో సూచించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.







