* ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి
UPDATED 12th OCTOBER 2018 FRIDAY 9:00 PM
గండేపల్లి: ప్రైవేటు పాఠశాలలకు ఫీజు రీఎంబర్స్ మెంట్ వర్తింపచేయాలని ఆదిత్య విద్యాసంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి అన్నారు. మండల కేంద్రమైన గండేపల్లిలోని తక్షశిల మోడల్ స్కూల్లో ప్రైవేట్ పాఠశాలల అధినేతల సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సమావేశానికి గండేపల్లి, జగ్గంపేట, కిర్లంపూడి, గోకవరం, ఏలేశ్వరం, ప్రత్తిపాడు, పిఠాపురం, గొల్లప్రోలు, సామర్లకోట మండలాలకు చెందిన విద్యాసంస్థల అధినేతలు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి మాట్లాడుతూ నేడు ప్రయివేట్ పాఠశాలలు చాలా కష్టంగా నడుస్తున్నాయన్నారు. చిన్న పాఠశాలలు మనుగడ సాధించాలంటే ఫీజు రీఎంబర్స్ మెంట్ పథకం వర్తింపచేయాలని అన్నారు. ప్రతీ పాఠశాల కరస్పాండెంట్ రోజులో ఒక గంట సమయం విద్యార్థులకు బోధించాలని సూచించారు. చిన్నస్థాయి నుంచి ఉపాధ్యాయుడిగా ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఈ స్థాయికి చేరానని, ప్రజాసేవ చేయాలని తోటి కరస్పాండెంట్ లు, స్నేహితులు పట్టుబట్టడంతో రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉన్నా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేసి ప్రైవేట్ పాఠశాలలకు అండగా నిలవాలని కోరుతున్నారని ఆయన అన్నారు. ఎమ్మెల్సీగా గెలిపిస్తే ప్రైవేటు పాఠశాలల సమస్యలపై ప్రభుత్వంపై పోరాడి పరిష్కరిస్తానని తెలిపారు. ప్రతీ ఒక్క యాజమాన్యం విలువలతో కూడిన ఉత్తమ విద్యను అందించడానికి ఆధ్యాత్మికత బాల్యం నుంచి విద్యార్థులకు నేర్పించాలని కోరారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన కృష్ణవర్మ, వి.ఎస్.పి. చౌదరి మాట్లాడుతూ ఆది నుంచి ప్రైవేటు విద్యా సంస్థలకు శేషారెడ్డి అండగా నిలిచారని, మరోసారి ఎమ్మెల్సీగా గెలిపించుకుంటే ప్రైవేటు పాఠశాలల తరఫున ప్రభుత్వంపై పోరాడి ప్రభుత్వం నుంచి రాయితీలు వచ్చే విధంగా చూస్తారన్నారు. నర్సరీ, ఎల్.కె.జి,యూకేజీలకు గతంలో ఉన్న స్కూల్ పర్మిషన్ మీదే నడుపుకునే వెసులుబాటు కల్పించాలని కోరారు. దీనిపై శేషారెడ్డి మాట్లాడుతూ ఈ నెలాఖరు లోపు ఈ విషయంలో పూర్తి స్థాయిలో పోరాటం చేసి వెసులుబాటు కల్పించే విధంగా కృషిచేస్తానని హామీ ఇచ్చారు. యాజమాన్యాలు అన్నీ కలిసి ఉంటే ఐదు ఎమ్మెల్సీలు ప్రైవేట్ పాఠశాలల తరఫు నుంచి గెలిపించుకునే అవకాశం ఉందని సూచించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు రఘురాం, ప్రియదర్శిని, నాయుడు, కిల్లి శ్రీను, ప్రకాష్, సత్యనారాయణ, శ్రీనివాస్, రఘు, రాంబాబు, కె. జగన్, తదితరులు పాల్గొన్నారు.







