UPDATED 6th AUGUST 2018 MONDAY 9:00 PM
సామర్లకోట: జిల్లా మానవహక్కుల పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో ఒక ప్రేమ జంటకు సోమవారం వివాహం జరిపించినట్లు జిల్లా మానవ హక్కుల పరిరక్షణ సంఘం అధ్యక్షుడు నూతలపాటి అప్పలకొండ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామర్లకోట పట్టణానికి చెందిన శెట్టి దావీదు, కౌతా అనురాధల వివాహానికి ఉభయుల తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో ఆదివారం రాత్రి స్థానిక పోలీసులను ఆశ్రయించారన్నారు. సామర్లకోట ఎస్ఐ ఎల్. శ్రీనివాస్ నాయక్ వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చినప్పటికీ వారు అంగీకరించలేదన్నారు. మేజర్లు అయిన ఆ జంట మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించిందని, వారికి సంఘం కార్యాలయంలో వివాహం జరిపించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు వల్లూరి నాని, జుత్తుక అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.







