UPDATED 23th JANUARY 2019 WEDNESDAY 9:00 PM
పెద్దాపురం: ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టడమే రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య ఉద్దేశ్యమని ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. మండలంలోని ఉలిమేశ్వరం గ్రామంలో రూ.65 లక్షలతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ నియోజకవర్గంలో గత నాలుగున్నర సంవత్సరాల్లో అభివృద్ధికి నోచుకోని పనులు చేపట్టి పూర్తి చేయడం జరిగిందని, ముఖ్యంగా గ్రామాల్లో సిసి రోడ్లు, డ్రైన్లు, అంగన్వాడీ, పంచాయతీలకు సొంత భవనాలు, రక్షిత మంచినీటి పథకం, చెత్త నుంచి ఎరువులు తయారు చేసే కేంద్రాలు, పారిశుధ్యం, ఎల్ఇడి లైట్లు, ప్రభుత్వ ఆసుపత్రులు అభివృద్ధి చేయడం జరిగిందని అన్నారు. వచ్చే నెల నుంచి రూ. రెండు వేలు వంతున పింఛన్లు, అలాగే డ్వాక్రా మహిళలకు స్మార్ట్ ఫోన్లు, రూ.10 వేలు నగదు అందచేయడం జరుగుతుందని అన్నారు. ఉలిమేశ్వరం గ్రామంలో ఉన్న మంచినీటి సమస్య, కాండ్రకోట గ్రామంలో గల ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో 24 గంటలు వైద్యులు ఉండేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. ఉలిమేశ్వరం నుంచి సిరివాడ వెళ్ళే రహదారిని రూ.55 లక్షలతో సిసి.రోడ్లు నిర్మించి నేడు ప్రారంభించామని, అలాగే రూ.10 లక్షలతో ఎస్సీ పేటలో స్త్రీశక్తి భవనానికి శంకుస్థాపన చేసినట్లు ఆయన తెలిపారు. పార్టీలకు అతీతంగా గ్రామాల్లో అర్హత ఉన్న అందరికీ పింఛన్లు, రేషన్ కార్డులు అందచేయడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమానికి ముందు మంత్రి గ్రామంలో పాదయాత్ర చేసి అంగన్వాడీ కేంద్రంలో బాలసంజీవిని పథకం క్రింద గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహార కిట్లు అందచేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుడాల రమేష్, జెడ్పీటీసి సుందరపల్లి శివనాగరాజు, ఆత్మా చైర్మన్ కలకపల్లి రాంబాబు, ఎంపిటిసి పేకేటి వెంకటేశ్వరరావు, అన్నవరం దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు కందుల విశ్వేశ్వరరావు, గుడా డైరెక్టర్ ఎలిశెట్టినాని, కొత్తెం వెంకట శ్రీనివాసరావు(కోటి), కమ్మిల సుబ్బారావు, అంగన్వాడీ కార్యకర్తలు, డ్వాక్రామహిళలు, మాజీసర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.







