UPDATED 7th AUGUST 2018 TUESDAY 9:00 PM
సామర్లకోట: తల్లి పాలే బిడ్డలకు ఆరోగ్యకరమని ప్రభుత్వ ఆసుపత్రి సూపరెంటెండెంట్ డాక్టర్ పి. చంద్రరావు అన్నారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లిపాల విశిష్టత, గర్భిణీలు తీసుకోవలసిన జాగ్రత్తలపై మంగళవారం అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా గైనకాలజిస్ట్ డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ తల్లిపాలలోనే అత్యధిక పోషకాలు ఉండటంతో పాటు రోగనిరోధక శక్తి కలిగి ఉంటుందని, తల్లి పాలు తాగే పిల్లలు ఆరోగ్యంగానూ, బలంగానూ ఉంటారన్నారు. బిడ్డ పుట్టగానే తల్లిపాలను తాగిస్తే వ్యాధులు సోకకుండా శిశువు సురక్షితంగా ఉంటుందన్నారు. శిశువు ఆరు నెలల వయసు వచ్చాక బయటి ఆహారం తినిపించాలని సూచించారు. పిల్లలకు సమయానుకూలంగా వ్యాధి నిరోధక టీకాలు ఇప్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో గర్భిణీలు, ఆసుపత్రి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.







