UPDATED 7th NOVEMBER 2020 SATURDAY 7:00 PM
గండేపల్లి (రెడ్ బీ న్యూస్): ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీ అమెజాన్ వెబ్ సర్వీసెస్ లో తమ సంస్థకు చెందిన విద్యార్థులు ఉద్యోగాలు సాధించడం హర్షణీయమని ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి తెలిపారు. గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విద్యా సంస్థల ప్రాంగణంలో గల ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులు ఖ్యాతి, దేవీ భవాని, సాయికిరణ్, రాజేష్ లు రూ.19లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాలు సాధించడంతో ఆదిత్య యాజమాన్యం వారిని అభినందన పూర్వకంగా శనివారం సత్కరించారు. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ సతీష్ రెడ్డి మాట్లాడుతూ ఆదిత్య విద్యా సంస్థలు గత మూడున్నర దశాబ్దాలుగా కెజి నుంచి పిజి వరకు క్రమశిక్షణతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తూ విద్యార్థుల తల్లితండ్రుల మన్ననలు పొందుతున్నామని అన్నారు. రాష్ట్రంలోనే కాకుండా దేశ, విదేశాల్లో గల ఎందరో విద్యార్థినీ, విద్యార్థులు మంచి కార్పోరేట్ సంస్థల్లో ఉద్యోగాలు పొందేలా ఇంజనీరింగ్ ప్రధమ సంవత్సరం నుంచి ప్లేస్ మెంట్ ట్రైనింగ్, టెక్నికల్ హబ్ ల ద్వారా కృషి చేస్తూ వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. ఆదిత్య గ్రూప్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలల నుంచి ఇప్పటి వరకు ఈ విద్యా సంవత్సరంలో 2100 మందికి పైగా విద్యార్థులు ఉద్యోగాలు పొందారని, అలాగే అర్హత గల ప్రతీ ఒక్క విద్యార్థికీ ఉద్యోగం కల్పించాలనే సంకల్పంతో నిర్విరామంగా కృషి చేస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగాలు పొందిన విద్యార్థులు, తల్లితండ్రులను ఆదిత్య యాజమాన్యం తరుపున ప్రశంసా పత్రం, జ్ఞాపిక, దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, డాక్టర్ ఆదిరెడ్డి రమేష్, టెక్నికల్ హబ్ సిఈవో బాబ్జి నీలం, తదితరులు పాల్గొన్నారు.







