UPDATED 23rd NOVEMBER 2018 FRIDAY 9:00 PM
సామర్లకోట: ప్రసిద్ధ పంచారామ క్షేత్రాల్లో ఒకటైన స్థానిక శ్రీ కుమారరామ భీమేశ్వరస్వామి ఆలయం శివనామ స్మరణతో మార్మోగింది. భక్తుల ప్రత్యేక పూజలతో క్షేత్రం ఆధ్యాత్మికతను సంతరించుకొంది. భక్తులు వేకువజాము నుంచే పవిత్ర పుష్కరిణిలో పుణ్య స్నానాలు ఆచరించి భీమేశ్వరుని దర్శనానికి బారులు తీరారు. ప్రధాన ఆలయానికి అనుసంధానంగా ఉన్న ఉపాలయాల్లో సైతం ప్రత్యేక పూజలు జరిపారు. శుక్రవారం సాయంత్రం దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ కంటే జగదీష్ మోహనరావు దంపతులు రథంలో స్వామి, అమ్మవార్లను ఊరేగింపుగా తీసుకొచ్చి గోదావరి జల హారతులు ఇచ్చారు. అనంతరం ఆలయం వద్ద జ్వాలా తోరణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఇవో పులి నారాయణమూర్తి, పడాల వీరబాబు, దూది రాజు, మహంకాళి వెంకట గణేష్, వేదపండితులు వేమూరి సోమేశ్వరశర్మ, కంతేటి భోగరాజు, సన్నిధిరాజు చెరుకూరి రాంబాబు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.







