అతిరాత్రయాగంతో కరుణించిన వరుణుడు

* ఐదవరోజు ఇంద్రుడికి ఆహ్వానం 
* పెద్దాపురంలో భారీ వర్షం 
* శుభసూచకమంటున్న నిర్వాహకులు
UPDATED 18th APRIL 2018 WEDNESDAY 10:30 PM
 
పెద్దాపురం: తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం పట్టణంలో స్థానిక పాండవులమెట్ట సమీపంలో ఈ నెల 14 నుంచి జరుగుతున్న అతిరాత్ర ఉత్క్రుష్ట శ్రౌత సోమయాగ క్రతువు బుధవారం ఐదవ రోజుకు చేరుకుంది. దీనిలో భాగంగా బుధవారం ఋత్విక్కులు నిర్వహించిన ప్రవర్గ్య ప్రభావంతో పెద్దాపురం పట్టణంలో భారీ వర్షం కురిసింది. వర్షం ధాటికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఐదవరోజు క్రతువులో భాగంగా దేవతలకు అధిపతి అయిన ఇంద్రుడిని మంత్రపూర్వకంగా ఆహ్వానించారు. మహావీర పాత్రలో క్షీరం, ఘృతం కలిపిన మిశ్రమాన్ని అశ్వనీ దేవతలకు అర్పించడం అగ్ని, సోమ, విష్ణు దేవతలకు ఘృతం అర్పించే ఉపసదం కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా ఋత్విక్కులు నిర్వహించారు. సోమయాగం కారణంగా వర్షం వస్తుందని ముందే చెప్పినట్లు యాగకర్త, సహాయ యాగకర్త కేశాప్రగడ హరిహరనాథ శర్మ, కేశాప్రగడ రాజశేఖరశర్మ తెలిపారు. వర్షం కురియడం ఎంతో మంచిదని, యాగం సత్ ఫలితాలను ఇస్తుందని అన్నారు.
ప్రవర్ఘ్యం... శాస్త్రీయ విజ్ఞానం 
అతిరాష్ట్ర ఉత్క్రుష్ట సోమయాగంలో ప్రవర్గ్య కార్యక్రమంలో ఎంతో శాస్త్రీయ విజ్ఞానం ఉంది. సోమయాగంలో ఐదవరోజు నుంచి నిర్వహిస్తున్న ఉదయ ప్రవర్ఘ్యం, సాయం ప్రవర్ఘ్యం అని, రెండుసార్లు ఈ క్రతువు చేస్తారు. ప్రధానంగా ప్రవర్ఘ్యం ద్వారా వాతావరణ శుద్ధి జరుగుతుంది. మహావీరం అనే మట్టి పాత్రలో ఘృతాన్ని పోసి మరిగిస్తారు. పాత్ర ఎర్రగా కాలిన తర్వాత అందులో మేకపాలు కుమ్మరిస్తారు. వెంటనే వలయాకారంలో ఒక అగ్నిగోళం పైకి లేస్తుంది. దీనిని పవర్ బాల్ అంటారు. ప్రవర్ఘ్యంలో ఎంతో శాస్త్రీయ విజ్ఞానం ఉంది. మట్టి పాత్ర, ఘృతం వంటి సాధారణ సామగ్రితో సృష్టించబడిన అగ్ని దాదాపు నాలుగువేల డిగ్రీల ఉష్ణాన్ని ఇస్తుందని శాస్త్రీయంగా ఋజువు చేయబడింది. ప్రవర్ఘ్యంతో వాతావరణ శుద్ధి జరిగి వర్షం కురుస్తుందని పలువురు శాస్త్రవేత్తలు సైతం నిర్ధారించారు. 
 
    
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us