UPDATED 14th JUNE 2019 FRIDAY 9:00 PM
రాజానగరం: నైపుణ్యం ఉంటే ప్రపంచస్థాయి పోటీలను సైతం సమర్ధవంతంగా ఎదుర్కోవచ్చని గైట్ మేనేజింగ్ డైరెక్టర్ కె. శశికిరణ్ వర్మ అన్నారు. ఇటీవల కోయంబత్తూరులో జరిగిన జాతీయస్థాయి గోకార్ట్ రేసింగ్ పోటీల్లో పాల్గొని వచ్చిన గైట్ కళాశాల విద్యార్థులకు ఎండి శశికిరణ్ వర్మ శుక్రవారం సర్టిఫికెట్లు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా గైట్ అటానమస్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టివి ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎండి శశికిరణ్ వర్మ మాట్లాడుతూ అమెరికా, చైనా వంటి దేశాల్లో గల ప్రభుత్వ పాఠశాల్లో స్కిల్ లాబ్స్ ఏర్పాటు చేసి అక్కడ వారికి చిన్నతనం నుంచి వివిధ రంగాల్లో నైపుణ్య శిక్షణ ఇస్తారని, గోకార్ట్ రేసింగ్ పోటీలకు వెళ్లిన విద్యార్థుల అంకితభావాన్ని స్వయంగా చూశానని అన్నారు. విద్యార్థుల అభివృద్ధికి తగిన వనరులను తాము సమకూరుస్తామని, విద్యార్థులు తమ విజ్ఞానాన్ని, ప్రతిభను ప్రదర్శించి కష్టించి పనిచేసి ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. ఈ ఏడాది పంజాబులో జరగనున్న పోటీల్లో కూడా పాల్గొని మంచి ప్రతిభా పాటవాలు ప్రదర్శించాలని ఆయన అన్నారు. కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ కోయంబత్తూరులో జరిగిన జాతీయస్థాయి గోకార్ట్ రేసింగ్ పోటీల్లో దేశవ్యాప్తంగా 71 టీములు పాల్గొన్నాయని, ఈ పోటీల్లో తొలిసారి పాల్గొన్న గైట్ కళాశాల టీము 19వ స్థానంలో నిలిచిందని అన్నారు. కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థుల సమిష్టి కృషితో ఇది సాధ్యపడిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గైట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె. లక్ష్మీశశివర్మ, జనరల్ మేనేజర్ డాక్టర్ పి. సుబ్బరాజు, గైట్ అటానమస్, గైట్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలల ప్రిన్సిపాల్స్ డాక్టర్ డాక్టర్ టివి ప్రసాద్, డాక్టర్ పిఎంఎంఎస్ శర్మ, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. లీలావతి, వివిధ విభాగాల అధిపతులు, డాక్టర్ ఎం. శ్రీనివాసరావు, వి. సుబ్రహ్మణ్యం, డాక్టర్ బి. సుజాత, డాక్టర్ డి. రవికిషోర్, డాక్టర్ ఎస్.వి.ఆర్.కె. రావు, డీన్ డాక్టర్ టి. జయానంద్ కుమార్, డాక్టర్ డి. వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.







