UPDATED 2nd AUGUST 2019 FRIDAY 9:00 PM
సామర్లకోట: కేంద్ర ప్రభుత్వం గత నెల పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన కార్మిక చట్టాల కుదింపు బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. సిఐటియు పట్టణ కమిటీ నాయకుల ఆధ్వర్యంలో స్థానిక మెహర్ కాంప్లెక్స్ నుంచి మఠం సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టిన అనంతరం తహసీల్దార్ వజ్రపు జితేంద్రకు వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా సిఐటియు మండల కార్యదర్శి టి. నాగమణి మాట్లాడుతూ కేంద్రంలో రెండవసారి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం కార్పోరేట్ శక్తులకు అనుకూలంగా, కార్మిక వ్యతిరేక విధానాలను చేపడుతోందని విమర్శించారు. 44 కార్మిక చట్టాలను నాలుగు కార్మిక కోడ్‌లుగా మార్చుతున్నట్లు ప్రకటించారని, ఇప్పటికి అందులో రెండు కోడ్‌లను గత నెల 23న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారని తెలిపారు. ఈ బిల్లు కారణంగా 13 కార్మిక చట్టాలు కనుమరుగైపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే కనుక అమలైతే కార్మికులను కార్పోరేట్ శక్తులు మరింత దోపిడీకి గురి చేస్తాయని పేర్కొన్నారు. తక్షణమే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన కార్మిక చట్టాల కుదింపు బిల్లును వెనక్కి తీసుకునేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎస్తేర్ రాణి, ఎస్.కె. ఫాతిమా, పిట్టా వెంకటలక్ష్మి, దుప్పట్ల సంఘం నాయకులు కరణం సత్యనారాయణ, కె. గోవిందరాజు, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు డి. శ్రీను, బి. శ్రీను, సిఐటియు ఉపాధ్యక్షులు కరణం ప్రసాదరావు, పి. వీరబాబు, సిహెచ్ మహేష్, అధిక సంఖ్యలో కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.







