UPDATED 25th NOVEMBER 2018 SUNDAY 10:00 PM
గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విద్యా సంస్థల ప్రాంగణంలో గల ఆదిత్య ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల గ్రౌండ్స్ లో తూర్పుగోదావరి జిల్లా ఫుట్ బాల్ అసోసియేషన్ సౌజన్యంతో నిర్వహించిన ఫుట్ బాల్ లీగ్-2 పోటీలు శనివారంతో ఘనంగా ముగిసాయి. ఈ పోటీల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఆదిత్య విద్యా సంస్థల వైస్ ఛైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి హాజరై విజేతలకు బహుమతి ప్రధానం చేశారు. ఉదయం మూడవ, నాల్గవ స్థానాలకు జరిగిన పోటీలలో రాజమండ్రి-1 నాల్గవ స్థానం, కాకినాడ ఫుట్ బాల్ క్లబ్ తృతీయస్థానంలో నిలిచారు. సాయంత్రం మొదటి, రెండవ స్థానాలకు జరిగిన పోటీలలో ఏలూరు ఫుట్ బాల్ క్లబ్ - కాకినాడ ఆఫ్రికన్ ఫుట్ బాల్ క్లబ్ క్రీడాకారులు హోరాహోరీగా తలపడి క్రీడాస్ఫూర్తితో ఆదిత్య ఫుట్ బాల్ లీగ్-2ను విజయవంతంగా ముగించారు. ఈ పోటీలలో జిల్లావ్యాప్తంగా 12 టీములు, 180 మంది క్రీడాకారులు పాల్గొన్నారని, లీగ్ పద్దతిలో జరిగిన అన్ని మ్యాచ్ లలోను మంచి క్రీడాస్పూర్తితో ఎటువంటి విభేదాలకు తావులేకుండా పోటీలు జరిగాయని నిర్వాహకులు తెలిపారు. ప్రథమ స్థానంలో నిలిచిన ఏలూరు ఫుట్ బాల్ క్లబ్ జట్టుకు ప్రధమ బహుమతిగా రూ.40వేలు, కాకినాడ ఆఫ్రికన్ ఫుట్ బాల్ క్లబ్ జట్టుకు ద్వితీయ బహుమతిగా రూ.30 వేలు, కాకినాడ ఫుట్ బాల్ క్లబ్ జట్టుకు తృతీయ బహుమతిగా రూ.20వేలు, నాల్గవ స్థానంలో నిలిచిన రాజమండ్రి-1 జట్టుకు రూ.10వేలు నగదుతో పాటు ట్రోపీలతో ఘనంగా సత్కరించారు. ఈ పోటీలలో పాల్గొన్న ప్రతీ క్రీడాకారునికి ధృవీకరణ పత్రాలు అందచేశారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య ఫుట్ బాల్ లీగ్ సెక్రటరీ గంగాధర్, ప్రిన్సిపాల్ డాక్టర్ శరభోజి, పరంజీత్ సింగ్, వివిధ కళాశాలల ఫిజికల్ డైరెక్టర్స్, క్రీడాకారులు, ఆదిత్య ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.







