UPDATED 21st DECEMBER 2018 FRIDAY 9:00 PM
రాజానగరం: విద్యార్థులు నైపుణ్య సామర్థ్యాలు పెంచుకుంటే జాతీయంగా, అంతర్జాతీయంగా మైనింగ్ ఇంజినీర్లకు అపారమైన ఉద్యోగావకాశాలు ఉన్నాయని జాంబియాలోని నాష్ హోల్డింగ్స్ గ్రూపు జనరల్ మేనేజర్ కె. శ్రీధర్‌రెడ్డి అన్నారు. గోదావరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ కళాశాలలోని మైనింగ్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ మైనింగ్ ఇండస్ట్రీ అనే అంశంపై శుక్రవారం సదస్సు నిర్వహించారు. గైట్ అటానమస్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి.వి.ప్రసాద్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సదస్సులో జాంబియాలోని నాష్ హోల్డింగ్స్ గ్రూప్ జనరల్ మేనేజర్ శ్రీధర్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని కీలక ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే మైనింగ్ ఇంజినీరింగ్ రంగంలో వస్తున్న అత్యాధునిక సాంకేతిక పద్ధతులపై పట్టు సాధించాలన్నారు. దక్షిణ ఆఫ్రికాలో మైనింగ్ రంగంలో అనుసరిస్తున్న ఆధునిక సాంకేతిక పద్ధతులను వివరించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ టి.వి. ప్రసాద్ మాట్లాడుతూ దేశంలో మేధోసంపత్తికి కొదవలేదని, విద్యార్థులు తరగతి గదులలో పాఠ్యాంశాలతో పాటు క్షేత్రస్ధాయిలోని విజ్ఞానాన్ని కూడా ఆకళింప చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గైట్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.జి.రామానుజం, మైనింగ్ విభాగాధిపతి డి.ఆర్.కె. శ్రీహరి, డీఎంఎస్ డైరెక్టర్ పి.ఆర్.కె.రాజు, మైనింగ్ విభాగాధిపతి పాఠక్ తదితరులు పాల్గొన్నారు.







