UPDATED 23rd SEPTEMBER 2017 SATURDAY 6:00 PM
ఏలూరు : విద్యార్థులను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దడంతో పాటు వారి భవిష్యత్తుకు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే గురుతర భాధ్యత ఉపాధ్యాయులపై ఉందని హేలాపురి డైమండ్స్ క్లబ్ అధ్యక్షుడు పెదిరెడ్డి ప్రదీప్ అన్నారు. స్థానిక శ్రీరామ్‌నగర్ జింగిల్ బెల్స్ స్కూల్‌లో ఉపాధ్యాయులలో దాగి ఉన్న నైపుణ్యతను వెలికితీసేందుకు నిర్వహించిన మీలో ఎవరు సూపర్ టీచర్ క్విజ్ కార్యక్రమంలో ఆయన పాల్గొని శనివారం మాట్లాడారు. జింగిల్‌బెల్స్ డైరెక్టర్ విస్సాప్రగడ సురేష్, శివనాగపోతురాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి న్యాయనిర్ణేతలుగా వడ్లపూడి కృష్ణమోహన్, కడియాల విజయలక్ష్మి, రాజేంద్ర, కోటేశ్వరరావు వ్యవహరించారు. దీనిలో 12 మంది ఉపాధ్యాయులను ఆరు గ్రూపులుగా విభజించి వారికి ఉన్న సబ్జెక్టులు, జనరల్ నాలెడ్జి మీద క్విజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏలూరు హేలాపురి డైమండ్స్ లయన్స్‌క్లబ్ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి క్లబ్ అధ్యక్షుడు పెదిరెడ్డి ప్రదీప్ అధ్యక్షత వహించారు. ఈ క్విజ్ కార్యక్రమంలో మొదటి మూడు గ్రూపులను విజేతలుగా ప్రకటించి వారిలో మొదటి విజేతకు రూ.1000, ద్వితీయ ,తృతీయ స్థానాల్లో నిలిచిన విజేతలకు ఇద్దరికి రూ.500 చొప్పున నగదు బహుమతులు అందచేశారు. మొదటి విజేత షేక్‌స్పియర్ గ్రూప్‌లో ఇంగ్లీష్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన షెహనాజ్ - దివ్య విజేతలు కాగా, రెండవ స్థానంలో నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ గ్రూప్‌లో సోషల్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన మేరీగ్రేస్ - ధనలక్ష్మీ, మూడో స్థానంలో గిడుగురామ్మూర్తి గ్రూప్‌లో తెలుగు విభాగానికి చెందిన సుధారాణి -అనంతలక్ష్మీ విజయం సాధించారు. వీరికి హేలాపురి క్లబ్ అధ్యక్షుడు ప్రదీప్ నగదు బహుమతులు అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఉపాధ్యాయుల్లో దాగిఉన్న మేధస్సు, విజ్ఞానం,సృజనాత్మకత బయటపడతాయన్నారు. నిత్యం పిల్లల మధ్య ఉంటూ పాఠాలు బోధించే ఉపాధ్యాయులకు ఇది ఒక ఆటవిడుపుగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటువంటి కార్యక్రమాలతో నూతనోత్తేజం పొంది మరింత మెరుగ్గా పాఠ్యాంశాలు బోధించేతత్వం ఉపాధ్యాయులకు ఆలవడుతుందని ఆయన పేర్కొన్నారు.







