UPDATED 8th AUGUST 2018 WEDNESDAY 6:00 PM
గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలకు చెందిన సివిల్ ఇంజనీరింగ్ విభాగం రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు సమర్పించిన రోడ్ సేఫ్టీ అడిట్ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రశంసలు లభించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి.కె. రామకృష్ణారావు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జాతీయ రహదారి-16పై ప్రమాదాలు తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రణాళికలలో భాగంగా కళాశాల సివిల్ ఇంజనీరింగ్ విభాగం రోడ్ సేఫ్టీ అడిట్ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేసినందుకు ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణాశాఖ, తూర్పుగోదావరి జిల్లా డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమీషనర్ ప్రత్యేక అభినందనలు తెలియచేశారన్నారు. రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ తరుపున వెహికిల్ ఇనస్పెక్టర్ పరంధామయ్య ప్రశంసాపత్రాన్ని అందించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఏ. రామకృష్ణ, సివిల్ విభాగాధిపతి ఏ. నాగసాయి, సివిల్ విభాగ అధ్యాపక సిబ్బందిని ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి, క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, తదితరులు అభినందించారు.







