UPDATED 21st JUNE 2018 THURSDAY 9:00 PM
గండేపల్లి: యోగా అనేది ప్రతీ ఒక్కరి జీవితంలో భాగం కావాలని ఆదిత్య క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో గల ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్. విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఫైనల్ ఇయర్ విద్యార్థి సి.హెచ్. దినేష్ నేతృత్వంలో విద్యార్థులు యోగాసనాలు అభ్యాసం చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ దైనందిన జీవితంలో యోగాను ప్రతీ ఒక్కరూ అలవాటుగా మార్చుకోవాలని, ఒత్తిడిని జయించేందుకు యోగా చక్కని మార్గమని అన్నారు. యోగాతో శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక వికాసం కలుగుతుందన్నారు. బాల్యం నుంచి యోగా సాధన చేస్తే మంచి నడవడికతో పాటు ఆరోగ్యంగా ఉంటారని, యోగాభ్యాసాన్ని నిరంతరంగా సాధన చేయాలని ఇది ఆరోగ్యానికి అపర సంజీవనిలా పనిచేస్తుందని తెలిపారు. వేల సంవత్సరాల సంపద అయిన యోగాను ముందుతరాలకు అందాలంటే విద్యార్థులతోనే సాధ్యమవుతుందన్నారు. అనంతరం యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందచేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ డాక్టర్ టి.కె. రామకృష్ణారావు, ప్రొఫెసర్ ఆదిరెడ్డి రమేష్, ఎన్ఎస్ఎస్ కో-ఆర్డినేటర్స్ పి. శివకుమార్, ఆర్. జ్ఞానావర్ధన్, భాస్కర్, బాలమోహన్, ఎమ్. సోమిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.







