UPDATED 3rd AUGUST 2018 FRIDAY 9:00 PM
గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్లో ఇంటిగ్రేట్ ఎంబిఎ, మేనేజ్ మెంట్ విభాగం డిగ్రీ తృతీయ సంవత్సరం చదువుచున్న విద్యార్థులు ఫుడ్ ఫెస్ట్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు మేనేజ్ మెంట్ విద్యతో సమానంగా వివిధ రకాల వ్యవస్థాపకతల గురించి ప్రత్యక్ష విషయ పరిజ్ఞానానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. ప్రిన్సిపాల్ డాక్టర్ డి. ఆస్థాశర్మ మాట్లాడుతూ విద్యార్థులు కేవలం పుస్తక పరిజ్ఞానానికి పరిమితం కాకుండా ఇటువంటి కార్యక్రమాల ద్వారా అనుభవపూర్వక జ్ఞానం లభిస్తుందని అన్నారు. విద్యార్థులు నూతనంగా స్టార్ట్ అప్ అనే కార్యక్రమం ద్వారా ఈ ఫుడ్ ఫెస్ట్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వివిధ రకాలైన ఆహార పదార్ధాలను సరసమైన ధరలకు విద్యార్థులకు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమం ద్వారా ఆర్జించిన లాభాలను అనాధాశ్రమానికి విరాళంగా అందజేయనున్నట్లు విద్యార్థులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.







