ముఖమంత్రి కృషితోనే రాష్ట్రాభివృద్ధి

UPDATED 26th DECEMBER 2018 WEDNESDAY 9:00 PM

సామర్లకోట: రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రతీ సంక్షేమ పథకాన్ని అత్యున్నత స్థాయిలో నిలిపిన ఘనత  రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి దక్కుతుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. సామర్లకోటలో యార్లగడ్డ వెంకట సుబ్బారావు కుటుంబీకుల ఆర్థిక సహకారంతో నిర్మించిన యార్లగడ్డ వెంకట సుబ్బారావు రైతు భవనాన్ని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్పతో కలిసి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు బుధవారం ప్రారంభించారు. అనంతరం హోం మంత్రి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి పుల్లారావు మాట్లాడుతూ ప్రజలకు కష్టాలు తెలియకుండా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో గత నాలుగు సంవత్సరాలలో ముఖ్యమంత్రి ఎంతో అభివృద్ధి చేశారని అన్నారు. పెద్దాపురం నియోజకవర్గంలో సుమారు రూ.1000 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టి ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన ఘనత హోం మంత్రి చినరాజప్పదని అన్నారు. ఐదు కోట్లు ప్రజలు రాష్ట్రంలో రైతులకు రూ.24 వేల కోట్లు రుణమాఫీ చేశారని, ఇందులో చివరి రెండు వాయిదాలు జనవరి నెలలో 10 శాతం వడ్డీతో చెల్లించడం జరుగుతుందని తెలిపారు. ఎంతో అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మరోసారి అవసరమని ముఖ్యమంత్రి  కష్టాన్ని దృష్టిలో ఉంచుకుని రాబోయే కాలంలో మరిన్ని అభివృద్ధి పనులు చేయడానికి ప్రజలు ముఖ్యమంత్రికి సహకరించాలని కోరారు. ఆక్వాకల్చర్ ను ముఖ్యమంత్రి ఎంతగానో ప్రోత్సహిస్తూ రైతులకు ఎన్నో ప్రయోజనాలు కల్పిస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం నుండి అనేక అవార్డులు అన్ని శాఖలకు రావడం గర్వకారణమన్నారు. రైతుల ప్రయోజనం దృష్టిలో పెట్టుకుని యార్లగడ్డ కుటుంబీకులు ఎవరి సహకారం లేకుండా రైతు భవనాన్ని నిర్మించి వారి దాతృత్వాన్ని చాటుకుని జన్మభూమి రుణాన్ని తీర్చుకున్నారని అన్నారు. ఆర్థికంగా స్థిరపడినప్పటికీ మంచి మనసుతో సేవలందించే మనస్సు ఉండాలని అన్నారు. ఈ సందర్భంగా యార్లగడ్డ కుటుంబ సభ్యులను మంత్రి అభినందించారు. భవన నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని మున్సిపాలిటీ నుంచి నిర్మాణానికి కేటాయించినందుకు ఉప ముఖ్యమంత్రి, మన్యం చంద్రరావులను మంత్రి అభినందించారు. ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ రైతుల సమస్యల పట్ల ముఖ్యమంత్రి వెంటనే స్పందించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నారని, మంచి వాతావరణంలో సుందరంగా రైతు భవనాన్ని నిర్మించిన యార్లగడ్డ కుటుంబీకులను మంత్రి అభినందిస్తూ రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు తమ సహకారం అందించాలని కోరారు. మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు చేయడం వలన రైతులకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ చందలాడ అనంత పద్మనాభం, మున్సిపల్  వైస్ చైర్మన్ యార్లగడ్డ రవిచంద్ర ప్రసాద్, పెద్దాపురం మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, రైతు సంఘం అధ్యక్షులు కంటే బాబు, భవన నిర్మాణ దాతలు యార్లగడ్డ సూర్యారావు, యార్లగడ్డ సత్యన్నారాయణమూర్తి, యార్లగడ్డ వీర్రాజు,  రైతులు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం రైతులు మంత్రులు, భవన నిర్మాణ దాతలను ఘనంగా సన్మానించారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us