UPDATED 13th JUNE 2020 SATURDAY 8:00 PM
సామర్లకోట(రెడ్ బీ న్యూస్): కౌలు రైతులకు సాగు హక్కు పత్రాలపై సంతకాలు చేసేందుకు రైతులు స్వచ్ఛందంగా ముందుకు రావాలని జిల్లా జాయింట్ కలెక్టరు డాక్టర్ జి. లక్ష్మీశ పేర్కొన్నారు. సామర్లకోట మండలం వికె రాయపురం గ్రామంలో కౌలు రైతులకు హక్కు పత్రాలను పంపిణీకి సంబంధించి శనివారం గ్రామ సభ నిర్వహించారు. వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు పద్మశ్రీ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జెసీ పాల్గొని మాట్లాడుతూ కౌలు రైతులకు హక్కు పత్రాలు మంజూరు చేయడం ద్వారా రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని, కౌలు రైతులకు ఇచ్చే పత్రాలపై రైతులు సంతకాలు చేసినంత మాత్రాన రైతుల భూముల విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవని పేర్కొన్నారు. ప్రకృతి విపత్తుల కారణంగా కౌలు రైతులు నష్టపోకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్డులను అందిస్తోందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జితేంత్ర, మండల వ్యవసాయాధికారిణి ఐ. సత్య, అర్.ఐ రాజేష్, గ్రామ నాయకులు తలారి దొరబాబు, తదితరులు పాల్గొన్నారు.







