UPDATED 8th JUNE 2018 FRIDAY 9:00 PM
సామర్లకోట: రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో అందరూ భాగస్వాములు కావాలని జెడ్పీటీసీ సభ్యురాలు గుమ్మళ్ళ విజయలక్ష్మి అన్నారు. మండలంలోని హుస్సేన్ పురం గ్రామంలో నాలుగో విడత నవనిర్మాణ దీక్షలో భాగంగా ఏడో రోజైన శుక్రవారం నిర్వహించిన మహాసంకల్పం కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ అవినీతి రహిత సమాజమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుకెళుతున్నారని, రాష్ట్రం మరింత ప్రగతిపథంలో పయనించాలంటే రాబోయే రోజుల్లో ప్రజలందరూ ఆయనకు మద్దతు పలకాలని కోరారు. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే మన నవ్యాంధ్ర రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలబెట్టడానికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని, రాష్ట్ర విభజన తర్వాత సంక్షోభంలో ఉన్న రాష్ట్రాన్ని సంక్షేమదిశగా తీసుకెళ్తున్నారని అన్నారు. గ్రామ టిడిపి అధ్యక్షుడు చల్లా బుజ్జి మాట్లాడుతూ దేశంలోనే నవ్యాంధ్రను మేటిగా నిలపడానికి ముఖ్యమంత్రి అహరహం శ్రమిస్తున్నారనీ, ఆయనకు అందరం సహకరించాల్సిన బాధ్యత ఉందన్నారు. అనంతరం నవ నిర్మాణ దీక్ష ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఈవోపిఆర్డీ సి.హెచ్. జగ్గారావు, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.







