UPDATED 11th FEBRUARY 2019 MONDAY 8:00 PM
పెద్దాపురం: ఎయిడెడ్ కళాశాలల్లో పనిచేస్తున్న పార్ట్ టైమ్ లెక్చరర్లు, నాన్ టీచింగ్ సిబ్బందిని తక్షణం క్రమబద్దీకరించాలని, అలాగే కనీస టైమ్ స్కేల్ కల్పించాలని కోరుతూ స్థానిక మహారాణీ కళాశాల ఎదుట పార్ట్ టైమ్ లెక్చరర్లు, నాన్ టీచింగ్ సిబ్బంది సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పార్ట్ టైమ్ లెక్చరర్ల అసోసియేషన్ కార్యదర్శి వి. రాజ్ కుమార్ మాట్లాడుతూ సుమారు 25 సంవత్సరాలుగా ఎయిడెడ్ డిగ్రీ, జూనియర్ కళాశాలల్లో పార్ట్ టైమ్ లెక్చరర్లు, నాన్ టీచింగ్ సిబ్బందిగా పనిచేస్తున్నామని, అలాగే ఎయిడెడ్ కళాశాలల్లో పనిచేస్తున్న టీచింగ్, నాన్-టీచింగ్ సిబ్బంది పదవీ విరమణ తరువాత వారి స్థానాల్లో ప్రభుత్వం పోస్టులను భర్తీ చేయకపోవడం అన్యాయమని, మేనేజ్ మెంట్ నెలకు రూ. ఐదు వేల నుంచి రూ ఏడు వేలు వేతనంతో కేవలం 10 నెలలు మాత్రమే వేతనాలు చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పిఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యూటీ వంటి సదుపాయాలు ఏమీ లేవని, అలాగే గతంలో సర్వీసు క్రమబద్దీకరించిన అధ్యాపకులకు రూ. లక్ష ప్రభుత్వం చెల్లిస్తున్నట్లు తెలిపారు. గతంలో అనేక జీవోలతో పార్ట్ టైమ్ లెక్చరర్లను క్రమబద్దీకరించారని, అలాగే అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో తమను వినియోగించుకుంటున్నారని, వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని పార్ట్ టైమ్ లెక్చరర్లు, నాన్-టీచింగ్ సిబ్బందిని క్రమబద్ధీకరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ ఏసుబాబు, వి. శ్రీనివాస్, ఎన్.వి. లక్ష్మీ, పి. గాయత్రీశ్వరి, ఎం. తాతాజీ, తదితరులు పాల్గొన్నారు.







