UPDATED 19th SEPTEMBER 2019 THURSDAY 6:00 PM
పెద్దాపురం(రెడ్ బీ న్యూస్) : ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఛానెల్ ప్రసారాల నిలిపివేత ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పాత్రికేయులు పేర్కొన్నారు. ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఛానెల్ ప్రసారాల నిలిపివేతను నిరసిస్తూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రిపోర్టర్లు ఇర్షాద్ ఆలీ, ఎన్.పి.ఎస్. వినాయక్ ఆధ్వర్యంలో పెద్దాపురం పాత్రికేయులు స్థానిక మరిడమ్మ అమ్మవారి దేవస్థానంలో అమ్మవారికి గురువారం వినతిపత్రం అందజేశారు. అనంతరం పలువురు సీనియర్ పాత్రికేయులు మాట్లాడుతూ మీడియాను అణగదొక్కాలని చూస్తే భంగపాటు తప్పదని, ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ప్రసారాలను తక్షణమే పునరుద్ధరించి మీడియా స్వేచ్ఛను కాపాడాలని అన్నారు. ఆర్టికల్ 19 ప్రకారం భావ వ్యక్తీకరణ ప్రాథమిక హక్కు అని, దీనిని హరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ప్రసారాలపై నిషేధం విధించడం సిగ్గుచేటన్నారు. పాలనను పక్కన పెట్టి పక్షపాత ధోరణితో మీడియాపై కక్ష సాధించటం ఏమిటని వారు ప్రశ్నించారు. ప్రభుత్వానికి అనుకూలంగా వార్తలు ప్రసారం చేయడంలేదనే కారణంతో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ప్రసారాలను నిలిపివేయడం అప్రజాస్వామిక చర్యని, ప్రభుత్వ నిర్ణయం జర్నలిజానికి సంకెళ్లు వేసినట్లుగా ఉందన్నారు. ప్రజాగొంతుకగా ఉన్న మీడియా పీకనొక్కే ప్రభుత్వాలు ఎక్కడా మనుగడ సాగించలేదని, ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించుకోవాలని అన్నారు. ప్రజాహితం కోరే మీడియాపై ఆంక్షలు విధించాలని చూడటం అవివేకమని, ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఛానెల్ ప్రసారాల నిలుపుదలను తక్షణమే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయులు మొల్లి సూర్యనారాయణ, బద్ది కుమార్, సూరిబాబు, వీరకుమార్, ప్రభుదాస్, మురళి, సత్యనారాయణ, శ్రీధర్, కృష్ణ ప్రసాద్, సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.







