UPDATED 5th DECEMBER 2018 WEDNESDAY 9:00 PM
పెద్దాపురం: రూపే ఎటిఎం కార్డులతో రూ. రెండు లక్షలు భీమా సదుపాయం పొందవచ్చని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (అమరావతి) ఎజిఎం కెఎం సునీత అన్నారు. పెద్దాపురం స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా వ్యవసాయ అభివృద్ధి శాఖ చీఫ్ మేనేజర్ ఎం.ఎన్. గోపాలకృష్ణన్ అధ్యక్షతన మండల పరిధిలో ఆర్.బి. కొత్తూరు గ్రామంలో బుధవారం నిర్వహించిన ఖాతాదారుల సమావేశంలో ఆమె ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏడాదికి రూ.12తో రెండు లక్షలు ప్రమాదభీమా రక్షణ పొందవచ్చని అన్నారు. అలాగే రూ.334 చెల్లించి సహజ మరణానికి కూడా రూ.రెండు లక్షలు ఇన్సూరెన్స్ పొందవచ్చని అన్నారు. ఖాతాదారులు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా అందిస్తున్నఎపివై పధకంలో చేరి వృద్ధాప్యంలో పింఛన్ సదుపాయం పొందవచ్చని, ప్రభుత్వ రాయితీలు సకాలంలో అందాలంటే బ్యాంకు రుణాలు సక్రమంగా చెల్లించాలని పేర్కొన్నారు. ఖాతాదారుల సేవా కేంద్రాల్లో డ్వాక్రా రుణాలు, క్రాప్ లోన్లు, గోల్డ్ లోన్లు పొందవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో అమరావతి చీఫ్ మేనేజర్ శ్యామల, కాకినాడ చీఫ్ మేనేజర్ రామ్మోహనరావు, ఎఫ్.సి.ఐ మేనేజర్ వై. నిర్మల, ఆర్.బి. కొత్తూరు, కట్టమూరు, ఆనూరు బిసి పాయింట్ నిర్వాహకులు, అధిక సంఖ్యలో ఖాతాదారులు, తదితరులు హాజరయ్యారు.







