UPDATED 22nd MARCH 2018 THURSDAY 9:00 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు అంతర్ యూనివర్సిటీ క్రీడా పోటీల్లో విశేష ప్రతిభ కనబరిచి పతకాలు సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి.కె. రామకృష్ణారావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కాకినాడ జె.ఎన్.టి.యు ఆదేశాల మేరకు అంతర్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు ముమ్మిడివరం ఎఐఎంఎస్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన క్రీడా పోటీలలో తమ కళాశాల విద్యార్థులు ఎం.వి. నవీన్ కుమార్ 100 మీటర్లు పరుగు పందెంలో ప్రథమస్థానంలో నిలిచి గోల్డ్ మెడల్, ప్రశంసా పత్రం, పి. రవితేజ జావెలిన్ త్రో లో తృతీయస్థానంలో నిలిచి ప్రశంసాపత్రం, మెడల్ సాధించారని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో పాల్గోవడం వల్ల మంచి శారీరక, మానసిక వికాసం కలుగుతుందన్నారు. విద్యార్థులలో గల ప్రతిభను గుర్తించి వారికి గల ఆసక్తిని బట్టి ఆయా క్రీడలలో సుశిక్షితులైన, అనుభవజ్ఞులైన వ్యాయమ అధ్యాపకులచే శిక్షణ ఇచ్చి ప్రోత్సహించడం వల్ల మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా విజేతలను ఆదిత్య క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎ. రామకృష్ణ, వ్యాయమ అధ్యాపకుడు ఆర్. తిరుమల, తదితరులు అభినందించారు.







