* ఘనంగా సర్జికల్ స్ట్రైక్స్ డే
* ఆకట్టుకున్న ప్రదర్శనలు
UPDATED 29th SEPTEMBER 2018 SATURDAY 9:00 PM
సామర్లకోట: దృఢ సంకల్పంతో చేసే పని ఏదైనా విజయం సిద్ధిస్తుందని, భారతదేశంలోని 126 కోట్ల మంది ప్రజల భద్రత సైనికుల చేతుల్లో ఉందని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సిహెచ్. సత్యవతి, ఎన్.సి.సి అధికారి జివివి సత్యనారాయణ అన్నారు. సామర్లకోట మండలం నవర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సర్జికల్ స్ట్రైక్స్ డే ద్వితీయ వార్షికోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్.సి.సి అధికారి జివివి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎన్.సి.సి క్యాడెట్లు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సత్యవతి, ఎన్.సి.సి అధికారి సత్యనారాయణ మాట్లాడుతూ 2016 సెప్టెంబర్ 29న భారతీయ ఆర్మీదళం కమాండోలు సర్జికల్ స్ట్రైక్ నిర్వహించి 35 మంది పాక్ మిలిటెంట్లను అంతమొందించారని అన్నారు. దానికి ప్రతీకగా అప్పట్నుంచి సర్జికల్ స్ట్రైక్స్ డే నిర్వహిస్తున్నామన్నారు. ప్రణాళిక, చిత్తశుద్ధి, క్రమశిక్షణలు క్యాడెట్లకు ఉండాలన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొని మనల్ని కాపాడే వారు సైనికులన్నారు. లాల్‌బహదూర్‌శాస్త్రి జైజవాన్, జైకిసాన్ అనీ ఆనాడు వారికి కితాబునిచ్చారని తెలిపారు. 1962లో చైనాతో జరిగిన యుద్ధంలోనూ, 1971లో పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలోనూ మన సైనికులు అపారమైన శక్తియుక్తులను ప్రయోగించి దేశాన్ని కాపాడారన్నారు. దేశానికి నిజమైన సేవకులు సైనికులు అన్నారు. దేశ సరిహద్దుల్లో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దేశాన్ని కాపాడుతున్నారని వారి సేవలను కొనియాడారు. మిలటరీ అంటే క్రమశిక్షణకు మారుపేరన్నారు. ఎక్కడికి వెళ్లినా అక్కడి పరిస్థితులకు అనుకూలంగా మారిపోయి దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతారన్నారు. అనంతరం నవర గ్రామంలో గాంధీజీ జయంతిని పురస్కరించుకుని స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా పాఠశాల, పరిసర ప్రాంతాలను శుభ్రం చేసి ప్రజలకు అవగాహన కల్పించారు. పడాల చారిటబుల్ ట్రస్ట్ అధినేత పడాల ప్రసాద్ విద్యార్థులకు వివిధ అంశములపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎం. శ్రీనివాసరావు, కె. రామకృష్ణ, మంగతాయారు, రాధామాధవి, వరలక్ష్మి, ప్రసాదరావు, నరేష్, శ్రీదేవి, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.







