UPDATED 14th OCTOBER 2017 SATURDAY 9:30 PM
సామర్లకోట: తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పట్టణానికి చెందిన బాల గణితావధాని తోటకూర సాయివంశీ ఈ నెల 15 న భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న అవార్డు గ్రహీత డాక్టర్ అబ్దుల్ కలాం 86 వ జయంతిని పురస్కరించుకుని ఆయనకు వినూత్నంగా నివాళులర్పించాడు. ఎటుకూడినా 86 వచ్చే విధంగా రూపొందించిన గణిత చదరంతో ఘనంగా నివాళులర్పించి తన అభిమానాన్ని చాటుకున్నాడు. తన పెదనాన్న రాష్ట్రపతి అవార్డు గ్రహీత, గణితావధాని తోటకూర సాయి రామకృష్ణ స్పూర్తితో వివిధ జాతీయ పండుగలకు, ప్రముఖుల జయంతి వేడుకలకు గణిత చదరాలను రూపొందించి తన అభిమానాన్ని తెలియచేయడం తనకు అలవాటుగా మారింది. గణితంపై తనకు గల మక్కువను చాటి చెబుతూ తోటి విద్యార్థుల్లో ఆసక్తిని పెంచుతూ పలువురి నుంచి ప్రశంసలను అందుకొంటున్నాడు. కాకినాడ ఆదిత్య పబ్లిక్ స్కూల్లో పదవ తరగతి చదువుతున్న వంశీ గణితంపై అమితాసక్తిని పెంచుకున్నాడు. ఈ సందర్భంగా వంశీని ఆదిత్య విద్యా సంస్థల సెక్రటరీ నల్లమిల్లి కృష్ణదీపక్ రెడ్డి, డైరెక్టర్ శృతి రెడ్డి, ప్రిన్సిపాల్ రమణి తదితరులు అభినందించారు.







