UPDATED 8th MARCH 2018 THURSDAY 9:00 PM
రాజానగరం: తూర్పుగోదావరి జిల్లా రాజానగరం కె.ఎల్.ఆర్. లెనోరా దంత వైద్య కళాశాల, ఆసుపత్రిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళాదినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమహేంద్రవరం నగరానికి చెందిన ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్ ఎ. ఉషాకిరణ్ పాల్గొని మాట్లాడారు. పురుషులతో సమానంగా స్త్రీలు అన్ని రంగాలలో ముందున్నారని, పూర్వం వంటింటికే పరిమితమైన మహిళ నేటి సమాజంలో విద్యాపరంగా, రాజకీయపరంగా, పారిశ్రామికవేత్తలుగా ఎదిగారన్నారు. ప్రతీ కుటుంబంలో మహిళ బాధ్యతతో నడుచుకుని ఆర్ధికంగా సహకారం అందించాలని, పొదుపు పాటించి తద్వారా కుటుంబానికి సక్రమమైన మార్గాన్ని చూపించాలన్నారు. కళాశాల చైర్ పర్సన్ కె. నాగమణి మాట్లాడుతూ మహిళలు స్వశక్తితో ఆర్ధికంగా ఎదగాలని, అన్ని రంగాలలో మహిళలకు సమాన అవకాశాలు లభిస్తున్నాయని అన్నారు. మహిళలు ఉన్నత విద్యను అభ్యసించాలని, తద్వారా తమ పిల్లలకు ఉత్తమమైన విద్యను లభించేలా చూడవచ్చన్నారు. అవకాశాలను వినియోగించుకుంటూ అనుకున్న లక్ష్యం మేరకు ముందడుగు వేస్తే విజయం సాధించవచ్చని, ఇందుకు నేడు వివిధ రంగాలలో ఉన్నత స్థానాలలో ఉన్న మహిళలే నిదర్శనం అన్నారు. లక్ష్యసాధనకు మహిళలు దృఢ సంకల్పంతో ముందుకు సాగాలని, మహిళా సాధికారతే దేశాభివృద్ధికి మూలమని, సంతోషంగా ఉన్న మహిళ సంతోషమైన కుటుంబానికి ప్రతీక అని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ వై. మధుసూదన్ రెడ్డి, డైరెక్టర్లు జి. నాగార్జునరెడ్డి, ఎ. ప్రసాద్ చౌదరి, ట్రెజరర్ కె. సింధు, ప్రిన్సిపాల్ డాక్టర్ విశ్వప్రకాష్ శెట్టి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వి. దాల్ సింగ్, డైరెక్టర్ (పిజి స్టడీస్) డాక్టర్ బి. లక్ష్మణరావు, మహిళా విభాగం సభ్యులు డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ రూపశ్రీ, డాక్టర్ లక్ష్మీదీప, డాక్టర్ వైష్ణవీదేవి, అనురాధ, అధిక సంఖ్యలో విద్యార్థినులు పాల్గొన్నారు.







