UPDATED 14th NOVEMBER 2018 WEDNESDAY 9:00 PM
సామర్లకోట: విద్యార్థులను భావిభారత ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. స్థానిక బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు తోటకూర సాయి రామకృష్ణ అధ్యక్షతన బాలల దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మండల విద్యాశాఖాధికారి జాన్, గౌరవ అతిధులుగా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఎస్ఐ సురేష్, ఎల్ఐసి పిఠాపురం బ్రాంచ్ అసిస్టెంట్ మేనేజర్ కె.రాఘవేంద్రరావులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతరత్న పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ ఆశయ సాధన కోసం నేటితరం కృషి చేయాలని, బాలల అభివృద్ధే ధ్యేయంగా ఉపాధ్యాయులు పనిచేయాలన్నారు. బాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యతని, బాలలపై నేటికీ వేధింపులు, బాల్య వివాహాలు చోటుచేసుకోవడం బాధాకరమన్నారు. వాటిని అరికట్టాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందని తెలిపారు. నేటి బాలలదే రేపటి సమాజమని వారి హక్కులపై ఇప్పటి నుంచి అవగాహన కల్పించుకోవాలని సూచించారు. బాలలకు నైతిక విలువలతో కూడిన జీవితాన్ని అందించాలని, వారి హక్కులను కాపాడాలని సమాజానికి మంచి పౌరులుగా అందించేందుకు, వారికి ఉన్నత భవిష్యత్తు ఏర్పడేందుకు ప్రతీ ఒక్కరూ సహకరించాలని అన్నారు. బాల్యం అందమైన జ్ఞాపకాలను మిగల్చాలని పేర్కొన్నారు. అనంతరం బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ అంశాల్లో నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన బాలబాలికలకు అతిధులు బహుమతులను అందజేశారు. గత సంవత్సరం ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఎల్ఐసి మెమెంటోలతో ప్రోత్సహించగా, విద్యార్థులకు విలువైన బహుమతులు ఎస్ఐ స్పాన్సర్ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వ్యాయమ ఉపాధ్యాయులు తాళ్ళూరి వైకుంఠం, ఉపాధ్యాయులు జి. గోవిందు, కె. అరుణ, కె.వి.వి. సత్యనారాయణ, శ్రీనివాసు, వల్లి, రైల్వే సిబ్బంది ఎస్. శివశంకర్, ఎస్. శ్రీనివాసరావు, కె. శివశంకర్, విద్యార్థినీ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.







