UPDATED 10th MARCH 2018 SATURDAY 10:00 PM
పెద్దాపురం: విద్యార్థి దశలో తీసుకునే ప్రతి నిర్ణయం భవిష్యత్తుపై ఆధారపడి ఉంటుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం దివిలి కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన రిజల్యూషన్స్ 2కె18 ముగింపు కార్యక్రమంలో ఆయన శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ బేతినీడి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి చినరాజప్ప మాట్లాడుతూ క్రమశిక్షణతో కూడిన జీవన విధానంతోనే అభివృద్ధి సాధ్యమని, ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు. కళాశాల చైర్మన్ బేతినీడి శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులు విలువలతో కూడిన జీవనం సాగించాలని, ఆత్మవిశ్వాసంతో ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చునని తెలిపారు. ప్రతి విద్యార్థికి లక్ష్యం ముఖ్యమని దాన్ని సాధించేందుకు అకుంఠిత దీక్షతో కృషి చేయాలన్నారు. విద్యార్థులు క్రమశిక్షణ, అంకితభావంతో మెలుగుతూ ఎంచుకున్న రంగంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, నీతి, నిజాయతీతో కార్యాలను పూర్తి చేస్తే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చనేందుకు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం జీవితమే ఆదర్శమని అన్నారు. నేటితరం విద్యార్థులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలని, విద్యార్థులు, అధ్యాపకుల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉండాలని అన్నారు. తమ కళాశాలలో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని, ఆత్మవిశ్వాసంతో చదివితే సంపూర్ణ జ్ఞానం లభిస్తుందని తెలిపారు. ఇటీవల తమ కళాశాలలో నిర్వహించిన జాబ్ మేళాలో సుమారు 501 మంది అభ్యర్థులు ఉద్యోగాలకు అర్హత సాధించారని అన్నారు. ఈ సందర్భంగా అగ్రికల్చర్ బిటెక్ లో జె.ఎన్.టి.యు.కె. టాపర్ గా నిలిచిన విద్యార్థిని శివ సాయిప్రియను సత్కరించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ జ్యోతుల నవీన్ కుమార్, ఎఎంసి చైర్మన్ ముత్యాల వీరభద్రరావు( రాజబ్బాయి), ఎంపిపి గుడాల రమేష్, టిడిపి మండలాధ్యక్షుడు కొత్తెం వెంకట శ్రీనివాసరావు (కోటి), కళాశాల ఇంఛార్జ్ ప్రిన్సిపాల్ సర్వరామేశ్వరుడు, ఏవో కె.ఆర్. సందీప్, ఈవో జెన్నిబాబు, ఏసివో పెదకాపు, ఫెస్ట్ కన్వీనర్ బేతినీడి వీరేంద్ర, టిడిపి జిల్లా ఉపాధ్యక్షుడు కమ్మిల సుబ్బారావు, సర్పంచ్ మెయిళ్ల కృష్ణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.







