UPDATED 20th FEBRUARY 2018 TUESDAY 8:30 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్లో మానవ వనరుల నిర్వహణపై ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ నాగార్జున కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ సంస్థ వ్యవస్థాపకులు ఎం.పి. రామారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు మానవవనరులను సమన్వయపరిచే విధానం గురించి విశ్లేషణాత్మకంగా వివరించారు. ఆధునిక పోటీ ప్రపంచంలో చదువుకు మాత్రమే పరిమితం కాకుండా సమిష్ఠి కృషి, వైఖరి, నాయకత్వ లక్షణాలు, సమయపాలన, సమన్వయం తదితర లక్షణాలను పెంపొందించుకున్నప్పుడే విజయం సాధించవచ్చని అన్నారు. కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ప్రణాళికాబద్ధంగా చదివి వారు ఎంచుకున్న లక్ష్యాలను సాధించే వరకు విశ్రమించకూడదని సూచించారు. ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. విశాలాక్షి మాట్లాడుతూ విద్యార్థులు విజయం సాధించాలంటే కష్టపడి కాక ఇష్టపడి చదివి అనుకున్న లక్ష్యాలను సాధించాలన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 150 మంది విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.







