UPDATED 23rd AUGUST 2019 FRIDAY 9:00 PM
సామర్లకోట (రెడ్ బీ న్యూస్) : ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పోరాడి ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జీవితం ఆదర్శప్రాయమని పలువురు పేర్కొన్నారు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 147వ జయంతిని పురస్కరించుకుని స్థానిక తహసీల్దార్, మండల ప్రజా పరిషత్ కార్యాలయాల్లో ఆయన చిత్రపటానికి శుక్రవారం పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ వజ్రపు జితేంద్ర, ఈవోపిఆర్డీ సూర్యనారాయణ మాట్లాడుతూ పేదరికంలో జన్మించి ఉన్నత విద్యను అభ్యసించిన టంగుటూరి దేశం కోసం జీవితాన్నే త్యాగం చేశారని, అలాంటి మహనీయుల జీవితాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. స్వాతంత్య్ర సమరయోధునిగా, దేశభక్తునిగా, మేధావిగా ప్రకాశం పంతులు దేశానికి ఎనలేని సేవలు అందించారని అన్నారు. ఆయన ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్ సూపరింటెండెంట్ విప్పర్తి సాయిబాబు, తహసీల్దార్ కార్యాలయ సూపరింటెండెంట్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.







