UPDATED 15th OCTOBER 2018 MONDAY 6:00 PM
గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విద్యా సంస్థల ప్రాంగణంలో గల పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన అబ్దుల్ కలాం భవన్ లో ఆదిత్య గ్రంధాలయ విభాగం ఆధ్వర్యంలో భారతదేశ మాజీ రాష్ట్రపతి, భారత రత్న డాక్టర్ అబ్దుల్ కలాం జయంతిని పురస్కరించుకుని సోమవారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆదిత్య క్యాంపస్ డైరెక్టర్, ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నిగర్వి, నిరాడంబరుడు కడు పేదరికంలో పుట్టిన గొప్ప జ్ఞాని కలాం అని, మనం కలాం సమకాలీనంలో జీవించడం మన అదృష్టమని అన్నారు. ఏ ఒక్కరూ పేదరికంతో అవకాశాలు కోల్పోయాను అనే భావనతో ఉండకూడదు అనడానికి ఆయన జీవితమే ప్రత్యక్ష ఉదాహరణని తన తుది శ్వాస వరకు దేశసేవలో ముఖ్యంగా విద్యార్థుల సేవలో తరించిన గొప్ప వ్యక్తి అన్నారు. పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.టి.వి.ఎస్. కుమార్ మాట్లాడుతూ అత్యంత పేదరికంలో పుట్టి అత్యున్నత స్థాయికి చేరిన మహోన్నత నేత ఆదర్శ మూర్తి అబ్దుల్ కలాం అని, యావత్ విద్యార్థి లోకానికి ఆయన జీవితం గొప్ప సందేశమని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్స్ డాక్టర్ వల్లెం శ్రీనివాసరావు, డాక్టర్ ఎస్. రమాశ్రీ, గ్రంధాలయాధికారి కె. అశోక్ కుమార్, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.







