* జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి
UPDATED 14th AUGUST 2020 FRIDAY 8:00 PM
కాకినాడ (రెడ్ బీ న్యూస్): కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో ఆక్సిజన్ తో కూడిన సుమారు 580 బెడ్స్ అందుబాటులో ఉన్నాయని, ప్రజలు అందోళన చెందాల్సిన పని లేదని జిల్లా కలెక్టర్ డి. మురళీధర్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి కార్డియాలజీ వార్డు, ఎస్ఆర్ఎంటీ బ్లాక్ లో ఉన్న ఆక్సిజన్ బెడ్స్ ను జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి, ట్రైనీ కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్ తో కలిసి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జీజీహెచ్ లో ఆక్సిజన్ అవసరమైనవారికి వెంటనే బెడ్స్ ఏర్పాటు చేసే విధంగా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ఆక్సిజన్ అవసరం లేకపోయిన చాలా మంది ఆక్సిజన్ తీసుకుంటున్నారని, అలాంటి వారిని వెంటనే గుర్తించి, వారి ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా జెఎన్టీయూలో ఉన్న కోవిడ్ కేర్ సెంటర్, లేదా ఇంటికి పంపించాలని తెలిపారు. ఆసుపత్రిలో శానిటేషన్ పనులు సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం ఆక్సిజన్ తో చికిత్స పొందుతున్న వ్యక్తులతో కలెక్టర్ మాట్లాడి వారి ఆరోగ్యపరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంట ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎం. రాఘవేంద్రరావు, ఆర్ఎమ్ఓ డాక్టర్ గిరిధర్, ఇతర వైద్యాధికారులు, తదితరులు పాల్గొన్నారు.







