UPDATED 4th MARCH 2018 SUNDAY 9:00 PM
సామర్లకోట: తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పట్టణం రెండవ వార్డు గణేష్ నగర్ ప్రజలు నివసిస్తున్న గృహాలపై నుంచి విద్యుత్ లైన్లు వెళ్లడంతో ప్రాణభయంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మానవహక్కుల సంఘానికి ఆదివారం ఫిర్యాదు చేశారు. కాలనీ ఏర్పడి సుమారు 20 సంవత్సరాలు గడిచినా తమ గృహాలపై నుంచి వెళ్తున్న 11కేవీ హైటెన్షన్ విద్యుత్ వైర్లను మార్చకపోవడంతో నిత్యం తాము ప్రాణభయంతో బ్రతుకుతున్నామన్నారు. ఈ విషయమై సంబంధిత మున్సిపల్, విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదన్నారు. లైన్లు మార్చేందుకు రూ. 50 వేలు ఖర్చు అవుతుందని దానిని బాధిత ప్రజలు భరిస్తే పనులు ప్రారంభిస్తామని విద్యుత్ శాఖ అధికారులు చెప్పడంపై ఆవేదన వ్యక్తం చేశారు. దళిత వార్డుల అభివృద్ధికి కేటాయించే ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతో ప్రాణాంతకంగా మారిన విద్యుత్ లైన్లను మార్పు చేయవలసినదిగా ప్రజలు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో పి. వీరభద్రరావు, ఎం.రవికుమార్, టి.లోవకుమారి, ఎన్. నిర్మల, బి.మేరీ, పి.సుకన్య, జి.బేబీరత్నం, పి. నాగమణి, తదితరులు పాల్గొన్నారు.







