UPDATED 13th OCTOBER 2017 FRIDAY 6:30 PM
ఏలూరు : పుస్తక పఠనంతోనే విజ్ఞానం పొందవచ్చని హేలాపురి డైమండ్స్ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు పెదిరెడ్డి ప్రదీప్ అన్నారు. ఏలూరు హేలాపురి డైమండ్స్ లయన్స్ క్లబ్, ఆంధ్రప్రదేశ్ గ్రంధాలయ సంఘం జిల్లాశాఖ సంయుక్తంగా ఏర్పాటు చేసిన సంచార గ్రంధాలయాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ విద్యార్ధుల్లో అంతర్లీనంగా నెలకొని ఉన్న నైపుణ్యం బయటకు తీయడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయన్నారు. ప్రతీ విద్యార్ధి తాను ఏరంగంలో అయితే స్థిరపడాలి అనుకుంటాడో ఆ స్థాయికి చేరేవరకు సరైన ప్రణాళిక వేసుకుని ఖచ్చితమైన మార్గంలో ప్రయాణించినట్లయితే విజయవంతం అవుతారన్నారు. విద్యతోనే మనకు సమాజంలో ఉన్నతమైన గౌరవం లభిస్తుందని సూచించారు. 2020 నాటికి ప్రపంచ జనాభాలో అత్యధిక యువత కలిగిన దేశంగా భారత్ ముందు వరుసలో ఉంటుందని అభిప్రాయపడ్డారు, నేటి బాలలే రేపటి మన దేశ భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేస్తారన్నారు. విద్యార్ధులలోని నైపుణ్యాన్ని ఉపాధ్యాయులు బయటకు తీసి సమాజానికి ఉత్తమ పౌరులను అందించాలన్నారు. పుస్తక పఠనంతో ఎంతో జ్ఞానాన్ని సంపాదించవచ్చని ప్రతీ ఒక్కరూ దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సంచార గ్రంధాలయంలో భాగంగానే హేలాపురి డైమండ్స్ లయన్స్ క్లబ్ తరపున అన్ని సబ్జెక్టులకు సంబంధించిన విలువైన 90 పుస్తకాలు జెడ్పి హైస్కూలు విద్యార్ధులకు ఇచ్చి ఒక నెలరోజుల తర్వాత ఆ పుస్తకాలలో నుంచి ఒక పరీక్షను నిర్వహిస్తామన్నారు. ఆ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్ధులకు హేలాపురి డైమండ్ లయన్స్ క్లబ్ తరపున సర్టిఫికెట్‌లు, బహుమతులు అందజేయడం జరుగుతుందని పేర్కొన్నారు. అనంతరం గైడ్‌లైన్స్ కార్యక్రమంలో భాగంగా వ్యక్తిగత వికాసం పుస్తకాలను అప్పనవీడులో జడ్‌పి హైస్కూల్లో 370 మంది విద్యార్థులకు ఆయన చేతుల మీదుగా అందచేశారు. ఈ కార్యక్రమంలో ఎల్. వెంకటేశ్వరరావు, ప్రధానోపాధ్యాయుడు రంగప్రసాద్, ఎంఈవో రమణ, వక్త రమేష్, రైల్వే టిటిఐ లయన్స్ జోన్ ఛైర్మన్ వి. కృష్ణమోహన్, లయన్స్ క్లబ్ కార్యదర్శి కడియాల విజయలక్ష్మి, శనక్కాయల భాను తదితరులు పాల్గొన్నారు.







