UPDATED 31st MARCH 2019 SUNDAY 9:00 PM
సామర్లకోట: రాష్ట్ర ప్రజల కష్టాలేంటో పాదయాత్ర చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి తెలుసని, జగన్ సీఎం అయితే అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని పెద్దాపురం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఎంఎల్ఏ అభ్యర్థిని తోట వాణి అన్నారు. సార్వత్రిక ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా సామర్లకోట పట్టణ పరిధిలో గల 2,4,5 వార్డుల్లో ఆమె ఇంటింటికీ తిరిగి ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ ప్రవేశపెట్టిన మ్యానిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ ఫ్యాన్ గుర్తుపై ఓటువేసి తనను గెలిపించాలని ప్రజలను కోరారు. అలాగే స్థానిక జూనియర్ కళాశాల ఎదురుగా గల ఆర్.సి.యం చర్చితో పాటు పట్టణంలోని పలు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి పాస్టర్ల ఆశీర్వాదాలు ఆమె అందుకున్నారు. అనంతరం తోట వాణి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన ఓ స్వర్ణయుగమని, ఆయన హయాంలో ప్రతీ ఒక్కరికీ పార్టీలతో సంబంధం లేకుండా అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాల ఫలాలు అందించారని అన్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి అందించిన సంక్షేమ పాలన మళ్ళీ రావాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా సామర్లకోట పట్టణానికి చెందిన సుమారు 100 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనికి చేరారు. వారికి తోట వాణి పార్టీ కండువాలు కప్పి పార్టీలోనికి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తోట వాణి కుమారుడు తోట రాంజీ, పార్టీ నాయకులు మద్దాల శ్రీను, సేపేని సురేష్, ఆవాల లక్ష్మీనారాయణ, ఊబా జాన్ మోజేష్, నేతల హరిబాబు, పితాని కృష్ణ, పాగా సురేష్ కుమార్, నక్కా జానకిరామయ్య, మసకపల్లి సత్యనారాయణ, ఎస్. భావన్నారాయణ, శెట్టిబత్తుల దుర్గ, చిత్తూరు లక్ష్మణరావు, లోవాచారి, ఎలిజిబెత్ రాణి, అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.







