సమావేశంలో ఎమ్మెల్యే రాపాక, ఆర్డీవో వసంతరాయుడు, డీఎస్పీ మాధవరెడ్డి, దేవాదాయశాఖ డీసీ విజయరాజు
అంతర్వేది (రెడ్ బీ న్యూస్) 7 జనవరి 2022 : వచ్చే నెల ఫిబ్రవరి 8 నుంచి 17 వరకు జరిగే అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి కల్యాణ ఉత్సవాలను సమన్వయంతో విజయవంతం చేద్దామని ఆర్డీవో ఎన్ఎస్వీబీ వసంతారాయుడు, ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు, డీఎస్పీ మాధవరెడ్డి, దేవాదాయశాఖ డీసీ విజయరాజు పేర్కొన్నారు. గురువారం ఉత్సవాలపై ఆలయ ఆవరణలో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ భక్తులు ఎటువంటి ఇబ్బంది పడకుండా స్వామివారిని దర్శించుకునేలా చూడాలన్నారు. క్యూలైన్లు, భక్తులకు అవసరమైన సౌకర్యాలు సమకూర్చాలని, పారిశుద్ధ్య సమస్య లేకుండా చూడాలని, రోడ్లు చెంత ప్రత్యేక డబ్బాలు, ఉత్సవాలు జరిగే అన్ని ప్రదేశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. సముద్రం చెంత గజ ఈతగాళ్లు, రక్షణ చర్యలు, రహదారుల్లో ముళ్ల చెట్లు తొలగించాలన్నారు. కండీషన్‌లో ఉన్న బస్సులను మాత్రమే నడపాలని కోరారు. సత్రాలకు, భక్తులకు తాగునీటి పంపిణీ, ఎల్‌ఈడీ దీపాలు ఏర్పాటు చేయాలన్నారు. ఎమ్మెల్యే రాపాక మాట్లాడుతూ గత ఉత్సవాలకు చేసిన పనికి గుత్తేదారులకు డబ్బులు ఇవ్వకపోవడంతో ఎవరూ ముందుకు రావడంలేదని, వెంటనే ఇచ్చి ప్రస్తుత పనులను శరవేగంగా చేయించాలని సూచించారు.







