పాఠశాలల సమస్యలు పరిష్కరించేదెప్పుడు?

*నామినేషన్ పద్దతిలో అభివృద్ధి పనులు చేపడితే సమస్యలు 
* మున్సిపల్ సమావేశంలో ప్రతిపక్ష సభ్యులు నిలదీత

UPDATED 22nd SEPTEMBER 2018 SATURDAY 9:00 PM

సామర్లకోట: మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం చైర్ పర్సన్ మన్యం పద్మావతి అధ్యక్షతన శనివారం జరిగింది. ఎజండాలో పొందుపరిచిన అంశాలపై ప్రతిపక్ష సభ్యులు ఆవాల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాలుగా పదవ వార్డులో అల్లంవారి వీధిలో పాఠశాల భవనంపై ప్రశ్నిస్తున్నా సమస్య పరిష్కరించలేదని,   కేవలం ఒక గదిని మాత్రమే నిర్మించి వదిలి వేయడంతో విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. పాఠశాల స్థలం ఆక్రమణకు గురవుతోందని కాంపౌండ్ వాల్ నిర్మించాలని డిమాండ్ చేశారు. మరో కౌన్సిలర్ కాళ్ల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ నామినేషన్ పద్ధతి కారణంగా పార్టీ వారికి పనులు కేటాయించే అవకాశం ఉంటుందని, అటువంటి సమయంలో ఆయా వార్డు కౌన్సిలర్లతో వివాదాలు ఏర్పడే అవకాశం ఉందని అన్నారు. దీనికి సమాధానంగా సీనియర్ కౌన్సిలర్ మన్యం చంద్రరావు మాట్లాడుతూ అటువంటి సమస్యలు ఏర్పడకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. యార్లగడ్డ అక్కిరాజు మున్సిపల్ ఉన్నత పాఠశాల విద్యార్థుల కోసం ఆర్వోప్లాంట్ ఏర్పాటు చేసినా అది విద్యార్థులకు ఉపయోగపడటం లేదని, అలాగే మరుగుదొడ్లు కూడా పూర్తి స్థాయిలో నిర్మించలేదని అన్నారు. దీనికి సమాధానంగా డిఇ రామారావు మాట్లాడుతూ పాఠశాలకు అదనపు భవన నిర్మాణానికి సర్వశిక్షాభియాన్ శాఖ నుంచి నిధులు రావాల్సి ఉందని, అలాగే ఆర్వో ప్లాంటు త్వరలో ప్రారంభిస్తామని, పాఠశాల స్థలం ఆక్రమణకు గురి కాకుండా తీగలతో కంచె ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కౌన్సిలర్  ఊబా జాన్ మోజెస్ మాట్లాడుతూ ఆరవ వార్డులో 28 సెంట్ల భూమి చుట్టూ ప్రహరీ నిర్మాణం చేయడానికి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఎఇ ప్రభాకర్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ గ్రాంట్లు నుంచి కాంపౌండ్ వాల్ నిర్మాణం చేస్తామని అన్నారు. కౌన్సిల్ సమావేశంలో చర్చించిన సమస్యలు ఇచ్చిన హామీలను పరిగణనలోకి తీసుకోవడం లేదని ప్రతిపక్ష సభ్యులు ఆరోపించారు. అదే విధంగా తోపుడు బండ్లు కొరత ఉందని వాటిని వెంటనే ఏర్పాటు చేయాలని అన్నారు. డిఇ రామారావు మాట్లాడుతూ త్వరలోనే ఏర్పాటు చేస్తామని అన్నారు. సీనియర్ కౌన్సిలర్ మన్యం చంద్రరావు మాట్లాడుతూ అత్యవసరం అయితే ఖాళీగా ఉన్న బండిని ఆ వార్డులకు కేటాయించాలని అన్నారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ సి.హెచ్. వెంకటేశ్వరావు, మున్సిపల్ సిబ్బంది,  వార్డు కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు. 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us