UPDATED 21st FEBRUARY 2019 THURSDAY 8:00 PM
గండేపల్లి: ఎన్నికల ప్రక్రియలో విశ్వసనీయత, పారదర్శకతకు పెద్దపీట వేసేందుకే ఈవీఎంలని గండేపల్లి తహసీల్దార్ వనజాక్షి అన్నారు. గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాలలో ఓటుహక్కు నమోదు, ఈవీఎంల పనితీరు, ఈవిఎంలపై ఓటు వేసే విధానంపై గురువారం అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 18 సంవత్సరాలు వయస్సు నిండిన ప్రతీ యువత ఓటుహక్కు నమోదు చేసుకోవాలని సూచించారు. భారత ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణ ఖచ్చితమైన నమ్మకానికి ప్రతిరూపంగా ఉండేందుకు వీవీప్యాట్‌లను అందుబాటులోకి తెచ్చిందని, వీటిపై పోలింగ్ కేంద్రాలు, పాఠశాలలు, కళాశాలల్లో అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ రీపోలింగ్‌కు ఆస్కారం లేకుండా ఉండేందుకు వీవీప్యాట్ యంత్రాలు దోహదపడతాయని అన్నారు. ఓటు ఎలా వేయాలో, అలాగే ఈవిఎం పరికరంలో ఓటర్లు తమ ఓటును ఎవరికి వేశారన్నది తెలుసుకునే అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఇవిఎమ్, వివిపిఎటి యంత్ర్రాలు ఉపయోగించే విధానంపై విద్యార్థులు, అధ్యాపకులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరక్టర్ మేనేజ్ మెంట్ ఎం.వి.హరనాధబాబు, డైరక్టర్ డాక్టర్ జి. రఘురాం, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. శంభుప్రసాద్, వైస్ ప్రెసిడెంట్ ఎం. సతీష్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె. సత్యనారాయణ, డీన్ అడ్మినిస్ట్రేషన్ డాక్టర్ జి. నరేష్, డీన్ ఆర్&డీ డాక్టర్ పి.వి.ఎస్. మాచిరాజు, వివిధ విభాగాధిపతులు, సీనియర్ అధ్యాపకులు, అధ్యాపకులు, ఎన్నికల రిటర్నింగ్ అధికారి నాగేశ్వరరావు, సూరంపాలెం విఆర్వో బి. వెంకటేశ్వరరావు, విద్యార్థినీ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.







