UPDATED 30th NOVEMBER 2018 FRIDAY 9:00 PM
సామర్లకోట: రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు పరిశ్రమలలో పనిచేసి పదవీ విరమణ చేసిన పెన్షనర్లు అనేక ఇబ్బందు పడుతున్నారని, వారి సమస్యలను పరిష్కరించాలని ఆల్ పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు సిహెచ్ సత్యనారాయణరాజు అన్నారు. పట్టణంలో ఆల్ పెన్షనర్ల సంఘం సమావేశం కాకపల్లి రమణమూర్తి అధ్యక్షతన శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న సత్యనారాయణరాజు మాట్లాడుతూ అనేక మంది పెన్షనర్లు నెలకు రూ.500 పెన్షన్ అందుకుంటూ అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఉద్యోగం చేసిన సమయంలో ఉద్యోగుల నుంచి వసూలు చేసిన సొమ్ముపై వచ్చే వడ్డీ కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. ప్రైవేటు పరిశ్రమల్లో పనిచేసి పదవీ విరమణ చేసిన కార్మికులు ప్రభుత్వం ఇచ్చే వృద్ధాప్య పెన్షన్ పొందడానికి అనర్హులుగా గుర్తింపబడుతున్నారని తెలిపారు. దీనిపై ప్రభుత్వం స్పందించి పదవీ విరమణ చేసిన కార్మికులకు నెలకు కనీసం రూ.6000 పెన్షన్ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎలిశెట్టి రామదాసు, చల్లపల్లి మాధవరావు, పెదిరెడ్ల సత్యనారాయణ, జార్జి బర్నదాసు, పాండ్రంకి సత్యన్నారాయణ, జిఇ హుసేన్ లింగం, భూషణం, కర్రి బాబూరావు, కొప్పన రాంబాబు, అధిక సంఖ్యలో పెన్షనర్లు, తదితరులు పాల్గొన్నారు.







