UPDATED 17th AUGUST 2017 THURSDAY 9:00 PM
కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఎన్నికలపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ఖరారును వ్యతిరేకిస్తూ హైకోర్టులో దాఖలైన మూడు పిటిషన్లను విచారణకు స్వీకరించిన హైకోర్టు కౌంటర్లు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, ఎలక్షన్ కమిషన్లను ఆదేశించింది. ఎన్నికల ఫలితాలు తమ తుది తీర్పునకు లోబడి ఉండాలని స్పష్టం చేసింది. ఎన్నికలు ఆపాలంటూ రెండు మేయర్ రిజర్వేషన్ పై స్పష్టత ఇవ్వాలంటూ దాఖలయిన మరో పిటిషన్ పై హైకోర్టు గురువారం స్పందించింది. తొమ్మిది గ్రామాలను విలీనం చేసి అక్కడి జనాభా, ఓటర్లను పరిగణనలోకి తీసుకొని 50 వార్డులుగా విభజించి రిజర్వేషన్లు ఖరారు చేశారని పిటిషనర్లు పేర్కొన్నారు. ఆ తర్వాత హైకోర్టు మూడు గ్రామాల విలీనాన్ని నిలిపివేసిందని, తొమ్మిది గ్రామాల విలీనంపై కేసులు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు జరిపితే రిజర్వేషన్లు, వార్డులపై ప్రభావం చూపుతుందన్నది పిటిషనర్ల వాదించారు. పిటిషనర్ల వాదనను ఎలక్షన్ కమిషన్, ప్రభుత్వం తోసిపుచ్చాయి. ఎన్నికలు నిలిపివేయవద్దని.. నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత న్యాయస్థానాలు జోక్యం చేసుకోవద్దని గతంలో సుప్రీంకోర్టు పేర్కొందని తెలిపాయి. మరోవైపు ఉమ్మడి రాష్ట్రంలో ఖరారు చేసిన రిజర్వేషన్ ఆధారంగా మేయర్ ఎన్నిక చట్ట విరుద్ధమని రాష్ట్ర విభజన నేపథ్యంలో మేయర్ రిజర్వేషన్ తిరిగి చేపట్టాలని మరో కేసు దాఖలు చేసింది. కార్పొరేషన్ లో ఎస్సీ జనాభా ఆధారంగా మేయర్ రిజర్వేషన్ ఖరారు చేయాలని కోరారు. మూడు కేసులను విచారణకు స్వీకరించిన హైకోర్టు పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వం, ఎలక్షన్ కమిషన్ లను ఆదేశించింది. మేయర్ రిజర్వేషన్ కు సంబంధించిన కేసును ఈనెల 30వ తేదీన వార్డుల విభజన, రిజర్వేషన్ల ఖరారు అంశాలపై సెప్టెంబరులో విచారణ చేపట్టనుంది.







