UPDATED 3rd JANUARY 2019 THURSDAY 9:00 PM
సామర్లకోట: పట్టణ ప్రాంతాల అభివృద్ధి పనులతో భాగంగా జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయాల వద్ద భక్తుల సౌకర్యార్ధం నిధులు కేటాయించి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని గుడా చైర్మన్ గన్నికృష్ణ అన్నారు. పంచారామ క్షేత్రాల్లో ఒకటైన సామర్లకోట శ్రీ కుమారారామ భీమేశ్వరస్వామి ఆలయం వద్ద రూ.40 లక్షలతో భక్తుల సౌకర్యార్ధం గుడా నిధులతో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసేందుకు గురువారం గుడా చైర్మన్ గన్ని కృష్ణ, వైస్ చైర్మన్ డాక్టర్ ఆర్. అమరేంద్రకుమార్, డైరెక్టర్లు గట్టి సత్యనారాయణ, ఎలిశెట్టి నాని, పిల్లి రవికుమార్, హోంమంత్రి తనయుడు రంగనాగ్ తదితరులు పాల్గొని భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా గుడా చైర్మన్ గన్ని కృష్ణ మాట్లాడుతూ భీమేశ్వరస్వామి ఆలయానికి అనేక ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తారని, వారి సౌకర్యార్ధం రూ.40 లక్షలు కేటాయించి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. గుడా ద్వారా వివిధ నియోజకవర్గాలలో అభివృద్ధి పనులు చేస్తూ సిఎం ఆలోచనలకు అనుగుణంగా నడుస్తున్నామని, అభివృద్ధి పనులు వేగవంతంగా చేయాలని కోరారు. ఆలయం వద్ద రూ.40 లక్షలతో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడంపై ఆలయ చైర్మన్ కంటే జగదీష్ మోహన్, ఈవో పులి నారాయణమూర్తి, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, ధర్మకర్తల మండలి సభ్యులు పడాల వీరబాబు, దూది రాజు, మహంకాళి వెంకట గణేష్, దేవస్థానం అన్నదానం ట్రస్ట్ చైర్మన్ బిక్కిన పరమేశ్వర సాయి, సత్యనారాయణ, తదితరులు గుడా పాలక మండలికి కృతజ్ఞతలు తెలిపారు.







