లాక్ డౌన్ ఎత్తివేశాక కోవిడ్ కేసులు పెరిగాయి

* రాబోయే రోజుల్లో మరిన్ని పెరిగే అవకాశం  
* జిల్లా కలక్టర్ డి.మురళీధర్ రెడ్డి

UPDATED 15th JUNE 2020 MONDAY 8:00 PM

కాకినాడ(రెడ్ బీ న్యూస్): కోవిడ్-19 లాక్ డౌన్ సమయంలో ఇంతవరకు సత్ఫలితాలు వచ్చాయని, లాక్ డౌన్ ఎత్తివేశాక వీటి సంఖ్య పెరిగిందని, రాబోయే రోజుల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని జిల్లా కలక్టర్ డి. మురళీధర్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్ లోని వివేకానంద సమావేశ మందిరంలో జాయింట్ కలక్టర్లు కీర్తి చేకూరి, జి. రాజకుమారితో కలిసి ఐయంసి, ప్రైవేట్ ఆసుపత్రుల ప్రతినిధులతో కోవిడ్-19పై తీసుకొంటున్న అంశాలపై ఆయన సమీక్షా సమావేశం సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలక్టర్ మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో కోవిడ్ బాధితులకు వైద్య సేవలు అందించే విధంగా ప్రైవేట్ ఆసుపత్రుల  సహాకారంతో ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. బొమ్మూరు కోవిడ్ సెంటర్ (సిసిసి)లో 3054 పడకలు, దీనితో పాటు సామర్లకోటలో 450 పడకలతో సిసిసి సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. బొమ్మూరు కేంద్రం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి అయ్యాయని, సామర్లకోట కేంద్రం వారం రోజుల్లో పూర్తి అవుతుందని, ఈ కేంద్రాలను   జాయింట్ కలక్టర్ జి. రాజకుమారి పర్యవేక్షణ చేస్తున్నారన్నారు. బొమ్మూరు కేంద్రం రామచంద్రపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సూపరింటెండెంట్ డాక్టర్ చైతన్య పర్యవేక్షణలో ఉంటుందన్నారు. ఈ కేంద్రాల నిర్వహణ పక్కా ప్రణాళికాబద్ధంగా జరిగే విధంగా శాస్త్రీయ పద్ధతిలో జరగాలన్నారు. బొమ్మూరు కేంద్రంలాంటి పెద్ద సెంటర్లలో బాధితుల సంఖ్య పెద్దఎత్తున ఉండే అవకాశం ఉంటున్నందున సమాచారం పక్కాగా నిర్వహించాలని కలక్టర్ సూచించారు. ఈ కేంద్రాలు రెగ్యులర్ ఆసుపత్రిలా పని చేస్తాయని, 24 గంటలు పనిచేసే విధంగా డాక్టర్లను నియామకం చేపట్టడం జరిగిందన్నారు. కరోనా పాజిటివ్ బాధితులకు మొదటి ప్రాధాన్యతగా హోం క్వారం టైన్ కల్పిస్తున్నామని, రెండో ప్రాధాన్యత క్రింద పిసిసి సెంటర్లు, మూడో ప్రాధాన్యత క్రింద ఆసుపత్రిలోని ఐసోలేషన్ కేంద్రాల్లో ఉంచడం జరుగుతుందన్నారు. జిల్లాలోని అన్ని ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల్లో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని, జిల్లాలోను ప్రతీ ఆసుపత్రిలో కరోనా సేవలు రి అందించేలా ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యం తమ వద్ద పనిచేసే వైద్యులు, సిబ్బందికి శిక్షణ ఇవ్వాలన్నారు. ప్రతీ  ప్రైవేట్ ఆసుపత్రి కరోనా బాదితుల కోసం నాలుగు గదులు సిద్ధం చేయాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో డిఆర్వో సిహెచ్ సత్తిబాబు, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం. రాఘవేంద్రరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి   డాక్టర్ మల్లిక్, డిసిహెచ్ డాక్టర్ రమేష్ కుమార్, ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ కిషోర్, ఐఎంసీ ప్రతినిధులు డాక్టర్ రవి,   తదితరులు పాల్గొన్నారు.

 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us