UPDATED 16th AUGUST 2019 FRIDAY 9:00 PM
సామర్లకోట: ఒడిషా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ నగరంలో ఈ నెల 18,19,20వ తేదీల్లో మూడు రోజులపాటు నిర్వహించనున్న భారతీయ కళాశ్రీ సన్మాన్ -2019 నృత్యోత్సవాలకు హాజరుకావాలని తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పట్టణానికి చెందిన ప్రముఖ కూచిపూడి నృత్యకారుడు అలమండ ప్రసాద్ కు ఆహ్వానం అందింది. ఇండియన్ డ్యాన్స్ అకాడమీ, ఆసియాన్ డ్యాన్స్ సొసైటీల సంయుక్త ఆధ్వర్యంలో భువనేశ్వర్ లోని బంజా మండపంలో నిర్వహించే ఈ ఉత్సవాలకు హాజరుకావాలని ఇండియన్ డ్యాన్స్ అకాడమీ చైర్మన్ మన్మోహన్ సింగ్ నుంచి శుక్రవారం ఈ ఆహ్వానం అందినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ ఈనెల 19వ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు తన కూచిపూడి నృత్య ప్రదర్శన ఉంటుందని, ఈ నృత్యోత్సవాలకు పలు రాష్ట్రాలకు చెందిన నృత్య కళాకారులు హాజరుకానున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా రాజ్యసభ సభ్యులు, పద్మవిభూషణ్ రఘనాధ మహాపాత్రో, ఒడిషా రాష్ట్ర పరిశ్రమల శాఖ డైరెక్టర్ ప్రణబ్ జ్యోతినాధ్, తదితర ప్రముఖులు హాజరై ప్రారంభిస్తారని, అత్యంత ప్రతిష్టాత్మకమైన భారతీయ కళాశ్రీ సన్మాన్-2019కి తనకు ఆహ్వనం అందడం ఎంతో గర్వంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రసాద్ ఇప్పటికే దేశ, విదేశాలతో పాటు పలు రాష్ట్రాలు, ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఇస్తూ రాణిస్తున్న విషయం విదితమే. ఈ సందర్భంగా నృత్యకారుడు ప్రసాద్ ను పలువురు అభినందించారు.







