అర్ధరాత్రి భారీ విస్ఫోటనం

* సుధా ఆగ్రో ఆయిల్‌ అండ్ కెమికల్ ఇండస్ట్రీస్ లో ఘటన
* పేలిన హైడ్రోజన్‌ ట్యాంకులు
* బీటలువారిన సమీప ప్రాంతాల ఇళ్ళ గోడలు 
* తప్పిన పెనుప్రమాదం 
UPDATED 22nd AUGUST 2017 TUESDAY 10:30 AM
పెద్దాపురం: స్థానిక సుధా ఆగ్రో ఆయిల్‌ అండ్‌ కెమికల్స్‌ ఇండస్ట్రీస్ ప్రైవేట్‌ లిమిటెడ్‌ లో  ఆదివారం అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. దీంతో పరిశ్రమలోని పలు విభాగాలతోపాటు యంత్రపరికరాలు అగ్నికి ఆహుతయ్యాయి. అతిపెద్ద శబ్దంతో పేలుడు జరగడంతో పరిశ్రమకు సుమారు మూడు కిలోమీటర్ల మేర భూమి కంపించింది. పెద్దపెద్ద శబ్దాలు కూడా రావడంతో పెద్దాపురం, సామర్లకోట పట్టణాల ప్రజలు ఉలిక్కిపడ్డారు. వివరాల్లోకి వెళ్తే పరిశ్రమలోని కూలింగ్‌ టవర్‌ దగ్గరలో ఉన్న 6 హైడ్రోజన్‌ గ్యాస్‌ ట్యాంకులు అకస్మాత్తుగా పేలిపోయాయి. 60 అడుగుల ఎత్తులో మంటలు ఎగిసిపడి పరిశ్రమలోని పలు విభాగాలకు మంటలు వ్యాపించడంతో పలు విభాగాలు, యంత్ర పరికరాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ హైడ్రోజన్‌ గ్యాస్‌ ట్యాంకుల పేలుడుధాటికి సుమారు 100 ఎం.క్యూబిక్‌ సామర్ధ్యం కలిగిన ఒక్కో హైడ్రోజన్‌ ట్యాంకు 50 అడుగుల దూరంలో ఉన్న కూలింగ్‌ టవర్‌లోకి దూసుకుపోయాయి. అలాగే పేలుడుధాటికి సమీపంలో ఉన్న హైడ్రోజన్‌ గ్యాస్‌ప్లాంట్‌, ఓల్డ్‌ హెచ్‌పీ గ్యాస్‌ ప్లాంట్‌, స్ట్రీమ్‌పైప్‌లైన్‌లు, వేక్స్‌ స్టోరేజీ గోదాములు పూర్తిగా దగ్ధమయ్యాయి. మంటలు చెలరేగడంతో లోప్రెజర్‌ హైడ్రాజేషన్‌ హోల్డర్స్‌, పెద్ద బులెట్‌లు2 పేలిపోయాయి. దీంతో బులెట్‌లు పేలినధాటికి అతిపెద్ద శబ్దాలతో మంటలు చెలరేగడంతో దగ్గరలోని గోదాములు, పవర్ ప్లాంట్లకు ఉన్న రేకులు, అద్దాలు పగిలిపోయాయి. అలాగే పరిశ్రమలోని చెట్లు, విద్యుత్తు స్తంభాలు నేలరాలాయి. పరిశ్రమలో మిగిలిన విభాగాల్లోని ఆపరేటర్లు అప్రమత్తంగా ఉండటంతో పవర్‌ప్లాంట్‌లోని యంత్రాలను వెంటనే నిలిపివేయడం జరిగిందని, ఒకవేళ హైడ్రోజన్‌ గ్యాస్‌ ట్యాంకులకు లీకులు ఏమైనా ఉంటే గ్యాస్‌ప్లాంట్‌లోని రియాక్టర్‌లో తెలిసిపోతుందని, ఎలాంటి కారణాలు లేకుండా అగ్నిప్రమాదం ఎలా సంభవించిందోనని పరిశ్రమ యాజమాన్యం చెబుతుంది. ఆ సమయంలో దగ్గరలో కార్మికులు కానీ, ఉద్యోగులు కానీ ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని పరిశ్రమ యాజమాన్యం తెలిపింది. సమాచారం తెలుసుకున్న పెద్దాపురం అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేసినప్పటికీ పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదానికి గురైన పరిశ్రమను సోమవారం ఆర్డీవో వి.విశ్వేశ్వరరావు పరిశీలించారు. ప్రమాదం  జరిగిన ప్రదేశాలను పరిశీలించి ప్రమాదానికి గల కారణాలు గురించి యాజమాన్యాన్ని ఆరా తీశారు. ప్రమాదం జరిగిన సమయంలో కార్మికులు ఎవరైనా ఉన్నారా, ప్రాణనష్టం ఏమైనా జరిగిందా అనే విషయాలపై పరిశ్రమ యాజమాన్యంతో చర్చించారు. దీనిపై జిల్లా ఉన్నతాధికారులకు సమగ్ర సమాచారాన్ని ఇవ్వనున్నట్లు ఆర్డీవో పేర్కొన్నారు. అనంతరం పెద్దాపురం డీఎస్పీ చిలకా వెంకట రామారావు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదం సంభవించటానికి ఆపరేటర్ల తప్పిదాలు ఏమైనా జరిగాయా, సిబ్బంది ఏమైనా నిర్లక్ష్యంగా వ్యవహరించారా అనే కోణంలో దర్యాప్తు చేశారు. ఈ విషయంపై డీఎస్పీ మాట్లాడుతూ అగ్నిప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదన్నారు.
 
 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us