* వ్యవసాయ శాఖా మంత్రి కురసాల కన్నబాబు
UPDATED 9th JULY 2020 THURSDAY 8:00 PM
కాకినాడ(రెడ్ బీ న్యూస్): రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ, సహకార, ఫుడ్ ప్రాసెసింగ్, మార్కెటింగ్ శాఖా మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. స్థానిక రమణయ్య పేటలోని తన క్యాంపు కార్యాలయంలో విలేఖరులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో రైతు సంక్షేమానికి పాటుపడిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి జయంతిని రైతు దినోత్సవంగా జూలై 8వ తేదీన ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు. రైతుల సంక్షేమం కోసం తన తండ్రి ఒక అడుగు వేస్తే, ఆయన కుమారుడైన జగన్మోహన్ రెడ్డి 10 అడుగుల ముందుకు వేసి రైతుల సంక్షేమమే ధ్యేయంగా పరిపాలన సాగిస్తున్నారని అన్నారు. గత సంవత్సరం మొట్టమొదటి సారిగా రైతు దినోత్సవాన్ని జమ్మలమడుగులో నిర్వహించగా, ఈ సంవత్సరం కరోనా కారణంగా ఆన్ లైన్ లో నిర్వహించడం జరిగిందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే ముఖ్యమంత్రి ఎక్కువ సమయాన్ని వైద్య ఆరోగ్య రంగాలతో పాటు వ్యవసాయ రంగానికి కేటాయించడం జరిగిందన్నారు. కరోనా వంటి సంక్షోభ సమయంలో కూడా అనుకున్న సమయానికి రైతులకు రైతు భరోసా సొమ్ము చెల్లించడం జరిగిందని, అలాగే ధరల స్థిరీకరణ కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి, మద్దతు ధరకే రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయడం జరిగిందన్నారు. అరటి, బొప్పాయి, బత్తాయి, ఉల్లి, మొక్కజొన్న, తదితర పంటలను రైతుల వద్ద నుంచి మార్కెట్ ధరకే ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు. ప్రతీ గ్రామంలో రైతు భరోసా కేంద్రం, ప్రతీ నియోజకవర్గానికి ఒక వ్యవసాయ ల్యాబ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 10 వేల జనతా బజార్లు ఏర్పాటు చేసి రైతులు పండించిన పంటలను అమ్ముకునేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. ఆక్వా రైతులకు యూనిట్ రూ.1.50కు విద్యుత్ సబ్సిడీ ఇస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి రైతు పక్షపాతిగా నూరు శాతం రుజువు చేసుకున్న గొప్ప నాయకుడని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా శ్రీకాకుళం, తూర్పుగోదావరి, కర్నూలు జిల్లాల్లో వ్యవసాయ యాంత్రీకరణ కేంద్రాలు ఏర్పాటుకు చర్యలు
తీసుకుంటున్నామని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించిన లబ్దిదారుల జాబితాలను ఆయా గ్రామ సచివాలయాల్లో, రైతు భరోసాకు సంబంధించి రైతు భరోసా కేంద్రాల వద్ద ప్రదర్శించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.







