UPDATED 17th OCTOBER 2017 TUESDAY 6:00 PM
పెద్దాపురం : సామాజికాభివృద్ధిలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమని కిట్స్ ఇంజనీరింగ్ కళాశాల ఛైర్మన్ బేతినీడి శ్రీనివాసరావు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం దివిలి కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిర్వహించిన రక్త నిర్ధారణ శిబిరాన్ని ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో జర్నలిస్టులకు ప్రత్యేక స్థానం ఉందని, అలాగే సమాజాభివృద్ధిలో పాలుపంచుకోవడమే కాకుండా సామాజిక కార్యక్రమాల్లో భాగస్వాములు కావడం శుభపరిణామమన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శర్మ, ఈవో జెన్నిబాబు మాట్లాడుతూ సమాజంలో సేవా కార్యక్రమాలను చేపట్టడం ద్వారానే గుర్తింపు లభిస్తుందని పేర్కొన్నారు. సంఘ జిల్లా కార్యదర్శి సుంకర ప్రసాద్ మాట్లాడుతూ తమ సంఘం ఆధ్వర్యంలో ఇప్పటికే పలు సేవా కార్యక్రమాల్ని చేపట్టడం జరుగుతోందని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు. అనంతరం సుమారు 500 మంది విద్యార్థులకు రక్త నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఏవో కె.ఆర్. సందీప్, కాండ్రకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్ అనూష, సంఘ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు రాకుర్తి రాంబాబు, నియోజకవర్గ అధ్యక్షుడు బూరాడ శ్రీనివాసరావు, జిల్లా సహాయ కార్యదర్శి మాసా చంద్రరావు (చందు), ఈసీ మెంబర్ పి. వీరభద్రవర్మ, సభ్యులు ఆలీ, సుధాకర్, రాజా శ్రీనివాస్, వెంకట్, చంద్రదాసు, పాశీల ప్రసాద్, రాధాస్వామి, వినాయక్, ల్యాబ్ టెక్నీషియన్స్ ఎస్.కృష్ణ, రత్నగిరి, రసూల్, ప్రసన్న కుమార్, తదితరులు పాల్గొన్నారు.







