UPDATED 28th SEPTEMBER 2018 FRIDAY 9:00 PM
గండేపల్లి: అంగన్వాడీ కేంద్రాలు ద్వారా పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు పోషకాహారం అందించే విధంగా అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వం బలోపేతం చేస్తున్నట్లు జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ అన్నారు. మండల పరిధిలోని మల్లేపల్లి, ఎన్.టి.రాజాపురం, గోపాలపురం గ్రామాల్లో రూ.21 లక్షలతో నిర్మించిన మూడు అంగన్వాడీ కేంద్రాలను ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా శాసనసభ్యులు నెహ్రూ మాట్లాడుతూ సొంతభవనాలు లేక అద్దె భవనాల్లో చాలీచాలని స్థలాల్లో అంగన్వాడీ కేంద్రాలను కొనసాగిస్తున్నారని, దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నూతన భవనాలను నిర్మించడం జరిగిందని అన్నారు. మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఈ భవనాలు ద్వారా చిన్నారులకు ఉంటుందని ప్రతీవారు తమ చిన్నారులను అంగన్వాడీ కేంద్రాలకు పంపించి ప్రభుత్వం అందిస్తున్న పోషక ఆహారాన్ని వినియోగించుకోవాలని తల్లిదండ్రులను కోరారు. ఈ కార్యక్రమంలో ఏఎంసి చైర్మన్ ఎస్.వి.ఎస్. అప్పలరాజు, కందుల కొండయ్యదొర, కోర్సు లచ్చయ్యదొర, మాజీ సర్పంచులు, సిడిపివో లక్ష్మి, అంగన్వాడీ కార్యకర్తలు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.







