UPDATED 12th NOVEMBER 2018 MONDAY 9:00 PM
సామర్లకోట: ప్రసిద్ధ పంచారామ క్షేత్రం శ్రీ చాళుక్య కుమారారామ భీమేశ్వరస్వామి వారి ఆలయంలో కార్తీకమాసం మొదటి సోమవారం పురస్కరించుకుని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్వామి, అమ్మ వార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు నిర్వహించారు. దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ కంటే జగదీష్ మోహన్, ఈవో పులి నారాయణమూర్తి ఆధ్వర్యంలో వేద పండితులు తొలుత ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం వేదస్వస్తి పలికి స్వామివారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలను ఆయనకు అందజేశారు. అలాగే తొలిదర్శనం చేసుకునేందుకు తెల్లవారు జాము నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయ పుష్కరిణి, గోదావరి కాలువల్లో పుణ్యస్నానాలు ఆచరించారు. హరహరమహాదేవా శంభూ అంటూ శివనామం జపించారు. ఆలయ ఈవో నారాయణమూర్తి, ట్రస్టుబోర్డు ఛైర్మన్ జగదీష్‌మోహన్ ఆధ్వర్యంలో గోపూజ, రుద్రాభిషేకం, రుద్ర హోమం, లక్ష పత్రి పూజ, అమ్మవారికి కుంకుమపూజ, జ్యోతిర్లింగార్చన, సూర్య నమస్కారాలు నిర్వహించారు. ఆలయ ఆవరణలోని ధ్వజస్తంభం, మారేడు, జమ్మి చెట్ల వద్ద మహిళలు దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.







