* శాస్త్రోక్తంగా ప్రారంభమైన మహాయజ్ఞం
* ఉపాసనాగ్నితో యాగశాల ప్రవేశం
*ఆదిలోనే భక్తులకు తాగునీటి కటకట
UPDATED 14th APRIL 2018 SATURDAY 9:00 PM
పెద్దాపురం: చారిత్రక పట్టణమైన తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో సంప్రదాయబద్ధంగా అతిరాత్ర ఉత్కృష్ట శ్రౌత సోమయాగ మహాక్రతువు శనివారం వైభవంగా ప్రారంభమైంది. ప్రారంభం రోజున భక్తులతో పాటు స్వాములు రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చారు. ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో యాగ యజమాని త్రేతాగ్నిహోత్రి బ్రహ్మశ్రీ కిరణ్ అవధాని, యజమాన ధర్మపత్ని మాలిని దంపతులను యాగకర్త బ్రహ్మశ్రీ కేశాప్రగడ హరిహరనాథ శర్మ దంపతులు యాగశాల అంకురార్పణ కార్యక్రమానికి ఉపాసనాగ్ని సహితంగా తీసుకువచ్చారు. అనంతరం వేదపారాయణ, గణపతి పూజ, యాగశాల పూజ, ఉపాసనాగ్నితో యాగశాల శుద్ది, పుణ్యాహవచనం పూర్తిచేశారు. అలాగే కర్ణాటక రాష్ట్రం శివమొగ్గ జిల్లా మత్తూరు అగ్రహారం నుంచి తీసుకువచ్చిన యాగ సామాగ్రిని శుద్ధిచేశారు. అనుజ్ఞా ప్రార్ధనం, స్వస్తి పుణ్యాహవచనం, సోమసంకల్పం, ఉదకశాంతి, సోమప్రవాకవరణం, సోమానివేదనం, రుత్విగ్వరణం, అగ్నిస్థాపనం, ఉఖా సంభరణం, వాయువ్య పశుయాగం నిర్వహించారు. గరుడ ఆకార చితి నిర్మాణం ప్రారంభించారు. ఆరునెలల పాటు కఠోర ఉపవాస దీక్షలో ఉన్న ఋత్విక్కులను మంగళ వాయిద్యాల నడుమ యాగస్థలికి ఆహ్వానించారు. అంతర శుద్ది కోసం ప్రాణాయామ అనే వైదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం యాగంలో ప్రాముఖ్యమైన అగ్నిచయనం నిర్వహించారు.
పశుపక్ష్యాదులకు పూజలు
యజ్ఞక్రతువు ప్రారంభంలో పశుపక్ష్యాదులను ఋత్విక్కులు వేద ప్రామాణికంగా పూజా కార్యక్రమాలను నిర్వహించారు. మానవులతో సన్నిహితంగా ఉండే గోవు, అశ్వాలను యజ్ఞస్థలికి తీసుకువచ్చి యాగశాల చుట్టూ ప్రదక్షిణ చేయించారు. ఋత్విక్కులు వీటితో పశువలంబన కార్యక్రమం నిర్వహించారు. యాగక్రతువులో వీటిని కూడా 12 రోజులపాటు ఉంచి పూజలు చేస్తారు.
యాగక్రతువులో పాల్గొన్న రాష్ట్ర ఉపముఖ్యమంత్రి చినరాజప్ప
అతిరాత్ర మహాయాగ క్రతువులో రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. యాగకర్త కేశాప్రగడ హరిహరనాథశర్మ ఆయనకు ఘనస్వాగతం పలికారు. అలాగే యాగశాలలో నిర్వహించే పూజా విధానాన్ని ఆసక్తిగా తిలకించారు. ఋత్విక్కులు హోంమంత్రికి వేదాశీర్వచనాలను అందచేశారు. అనంతరం హోంమంత్రి చినరాజప్ప మాట్లాడుతూ అతిరాత్ర మహాయాగాన్ని వీక్షించడం తన పూర్వజన్మసుకృతమని, ఇంత గొప్ప యాగం పెద్దాపురం పట్టణంలో నిర్వహించడం చాలా సంతోషదాయకం అన్నారు. యాగ నిర్వహణ కారణంగా దేశం సుభిక్షంగా ఉంటుందని పేర్కొన్నారు. అలాగే మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు, వైస్ చైర్మన్ కొరుపూరి రాజు, ఆర్డీవో వి. విశ్వేశ్వరరావు, ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ బొడ్డు బంగారుబాబు, వెంకటేశ్వర రైస్ మిల్స్ అధినేత వల్లూరి సూర్య ప్రకాశరావు, తూతిక రాజు పలువురు ప్రముఖులు హాజరయ్యారు
కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
అతిరాత్ర యాగక్రతువుకు సంబంధించి పోలీసుశాఖ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 250 మందితో ప్రత్యేక పోలీసు బందోబస్తును నియమించారు. ప్రతీరోజు యాగానికి వేలాదిగా తరలివచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించాల్సిన అధికార యంత్రాంగం దూరంగా ఉంటోంది. ఏర్పాట్లు విషయంలో నిర్వాహకులకు సహాయ సహకారాలు అందించే విషయంలోనూ అధికారులు అలనత్వం వహిస్తున్నారు. తొలిరోజు మంచినీటి కోసం భక్తులు ఇబ్బంది పడ్డారు. నీటి వసతి విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకోకపోతే వేసవి దృష్ట్యా భక్తులు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. భక్తుల రాక మరింతగా పెరిగితే ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదు.







