* కాకినాడ ఎన్‌సీసీ గ్రూప్ పరిపాలనాధికారి కల్నల్ ఏకె ఓరా
UPDATED 29th JANUARY 2020 WEDNESDAY 9:00 PM
సామర్లకోట(రెడ్ బీ న్యూస్): దేశ రక్షణలో ఎన్‌సీసీ కేడెట్ల పాత్ర ఎంతో కీలకమని కాకినాడ ఎన్‌సీసీ గ్రూప్ పరిపాలనాధికారి కల్నల్ ఏకె ఓరా అన్నారు. 18వ ఆంధ్రా ఎన్‌సీసీ బెటాలియన్ ఆధ్వర్యంలో స్థానిక విస్తరణ శిక్షణా కేంద్రం (ఈటీసీ)లో ఈనెల 25 నుంచి ఫిబ్రవరి 3వ తేదీ వరకు నిర్వహిస్తున్న శిక్షణా శిబిరాన్ని బుధవారం ఆయన తనిఖీ చేసి శిక్షణా విధానాన్ని పరిశీలించారు. ఈ శిబిరంలో తూర్పు, పశ్చిమ, కృష్ణా జిల్లాలకు చెందిన 550 మంది ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ విభాగాలకు చెందిన ఎన్‌సీసీ క్యాడెట్లు, సీనియర్ క్యాడెట్లు శిక్షణ పొందుతున్నారు. ఈ సందర్భంగా క్యాడెట్లు నుంచి గౌరవ వందనం స్వీకరించిన అనంతరం కల్నల్ ఓరా మాట్లాడుతూ సైనికుల ఎంపికలో ఎన్‌సీసీ క్యాడెట్లకు ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు దేశభక్తి పెంపొందించేలా క్రమశిక్షణతో తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. అనంతరం క్యాడెట్లకు ఇస్తున్న ఫైరింగ్, ఇతర శిక్షణలు, వసతి గదులు, భోజన సదుపాయాలను ఆయన పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట ఎన్‌సీసీ అధికారులు ఎ.ఎస్. రాణా, సందీప్ సింగ్, తదితరులు ఉన్నారు. ఈ శిక్షణా శిబిరంలో ఎం. కృష్ణమోహన్, ఎస్. అనిల్, ఎం. సతీష్, రామకృష్ణ, జి. సునీల్ కుమార్, శ్రీనివాస్, ఎస్.వి. నాగిరెడ్డి, జి. అనిల్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.







